మనిషి చర్మంపై ఒమిక్రాన్ వేరియంట్ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ.. అదే ప్లాస్టిక్ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేనని తెలిపింది.
ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని.. అందువల్లే డెల్టా రకంతో పోలిస్తే శరవేగంగా వ్యాప్తి జరుగుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్ ఉపరితలంపై 193.5 గంటల పాటు అంటే దాదాపు 8 రోజులు జీవించగలదట. వుహాన్ వేరియంట్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం.
ఆల్ఫా, బీటా వేరియంట్ల మధ్య పర్యావరణ స్థిరత్వంలో పెద్దగా తేడాఏమీ కనబడలేదని పేర్కొన్నారు. తగిన సాంద్రత కలిగిన ఆల్కాహాల్‌తో తయారైన శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలోనే వైరస్ అంతమవుతుందని తెలిపారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.