Omicron New Rules: భారత దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మళ్లీ భయ పెడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాలను కూడా ఈ మహమ్మారి భయపెడుతోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులే ఉన్నా.. చాలామంది శాంపిల్స్ నిర్ధారణ కావాల్సి ఉంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యం డబుల్ డిజిట్ కేసులు నమోదు అవుతుండడం ఆందోళన పెంచుతోంది..
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ మళ్లీ ఆందోళన మొదలైంది. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది.
ఇప్పటికే మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100 దాటింది. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 20 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 108కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వారం రోజుల క్వారంటైన్ విధించారు. ఇతర అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించకుండా ఆంక్షలు పెట్టారు. వారికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు.
అటు కోవిడ్, ఇటు ఒమిక్రాన్.. ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా మోదీ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, సహా పలు రాష్ట్రాలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు.