కూరగాయల మార్కెట్లో ఓ ఇటుకరాయి తీసుకొని, స్వయంగా సామాజిక దూరం పాటించేలా కొలతలతో వృత్తాలను సర్కిల్ గీసి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు మమతా బెనర్జీ గురువారం కోల్‌కతా వీధుల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె అధికారులతో కలిసి కోల్‌కతాలోని ఒక కూరగాయల మార్కెట్ కు చేరుకున్నారు. అక్కడ కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు, ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం ఎలా పాటించాలనే దానిపై పలు సూచనలు చేశారు. అనంతరం స్వయంగా ఇటుక రాయితో వృత్తాలను గీసి దానిలో మాత్రమే నిలబడాలని సూచించారు. చాలాసేపు మార్కెట్లో ఇలా సర్కిల్స్ గీస్తూ గడిపారు. అనంతరం అక్కడ దుకాణ దారులంతా ఇలా సర్కిల్స్ గీసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సోషల్ డిస్టెన్స్ పాటించడం ఈజీ అవుతుందని సూచించారు. ప్రతి రోజు దుకాణం తెరిచిన వెంటనే విధిగా ఇలా షాపు ముందు గీతలు గీసుకోవాలని అన్నారు. అధికారులు ఈ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటారని... ఎవరైనా ఇలా చేయకపోతే చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ స్వయంగా పోస్టు చేశారు. అంతేకాకుండా ‘‘నో వర్డ్స్‘ అంటూ ఈ వీడియోను ఉద్దేశించి ఓబ్రెయిన్ కామెంట్ పెట్టారు. కాగా, బెంగాల్లో ఇప్పటి వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి.