కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలు, గొడవలు, బ్లాక్ మార్కెట్ దందాలు, పేరున్నవాళ్లకు సైడ్ మార్కెట్లు మనం చూస్తున్నాం. ఇంకా వ్యాక్సిన్ కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తులు, కొత్త వ్యాక్సిన్ వచ్చేస్తుందనే వార్తలూ వింటున్నాం. అయితే అసలు కరోనా వ్యాక్సిన్ ముఖమే చూడని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు.
అందుకే, ఇప్పటివరకు దాదాపు 174 దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆఫ్రికాలో పదికిపైగా దేశాలు ఈ విభాగంలో ఉన్నాయి. అసలు అక్కడ వ్యాక్సిన్ అంటే ఏంటో తెలియకపోవడం విశేషం. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని ముందుగానే సేకరించడంలో, పంపిణీ చేయడంలో డబ్బున్న దేశాలు చాలా ముందున్నాయని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 174 దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 128 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. అయితే ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అనే ఊసే లేదు. ఛాద్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ... వ్యాక్సిన్ అనే మాటే వినిపించడం లేదు. పేద దేశం కావడమే దీనికి కారణమని అక్కడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆరుకుపైగా దేశాల్లో ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వీటిలో ఆఫ్రికా దేశాలే ఎక్కువ. ఛాద్, బుర్కినా ఫాసో, బురుండి, ఎరిట్రియా, టాంజానియా వంటి దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అంతేకాదు వ్యాక్సిన్ అందుబాటులోకి రాని అలాంటి దేశాల్లో కొత్తరకం కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదమూ ఉందని WHOకి చెందిన కొవాక్స్ సమన్వయకర్త గియాన్ అంటున్నారు. ఇలాంటి పేద దేశాలకు వ్యాక్సిన్ విరాళంగా ఇవ్వడానికి ధనిక దేశాలు ముందుకొస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
ఇదే సమయంలో ఆఫ్రికాలో కొత్తరకం కరోనా వేరియంట్ బయటపడటంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యం అందించే వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్రంట్లైన్ వర్కర్స్ అయిన వారికి కూడా వ్యాక్సిన్ అందకపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.
విధులు నిర్వర్తించాలంటేనే భయంగా ఉందని అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియాకు ఫ్రంట్ లైన్ వారియర్స్ చెబుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు వ్యాక్సిన్ను ఎందుకు సమకూర్చుకోలేక పోతున్నాయో తెలియడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బుర్కినా ఫాసో తొలుత భారత్లోని ఓ వ్యాక్సిన్ తయారీ సంస్థతో ఒప్పందం కుదర్చుకుంది. అయితే భారత్లో సెకండ్ వేవ్ ఉద్ధృతి ఉండటంతో... సరఫరాలో అంతరాయం కలిగిందని సమాచారం.