కోవిడ్ మహమ్మారి ఎంతో మందిని కబళిస్తోంది. మరికొంత మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇలా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం దృష్ట్యా వైరస్ బారిన పడిన వారికి అండగా నిలిచేందుకు పలు స్వచ్ఛంద, సేవా సంస్థలు, వ్యక్తులు ముందుకొస్తున్నారు. తోచిన విధంగా ఆహారం, శానిటైజర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరాత్ర ఉచితంగా అందజేస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు.
ఆ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర వేలమంది మహిళలతో సమూహంగా ఏర్పడిన నారీ సేన గ్లోబల్ ఉమెన్ ఫోరం సంస్థలోని మహిళలంతా కరోనా బాధితులకు తమవంతు చేయూత అందిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ కారణంగా హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఎలాంటి వసతి లేని వారికి, వృద్దులకు, ఎవరూ లేని అనాధలకు రెండుపూటలా భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని అన్ని పట్టణాలకు విస్తరిస్తూ పోతున్నారు. ఈ సంస్థ మహిళలు తమ సొంత డబ్బులతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సంస్థ అధ్యక్షురాలు లతా చౌదరి బొట్ల చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, బెంగళూరుల్లో ప్రతిరోజు వందల మంది కరోనా బాధితులకు ఇండ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నామని నారీసేన నిర్వాహకురాలు అంటున్నారు.
హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఇంట్లో భోజనం సౌకర్యం లేని వారు తమకు వాట్సాప్ ద్వారా తగిన ఆధారాలు, అడ్రస్‌తో సమాచారం పంపిస్తే సంస్థ ప్రతినిధులు డోర్ డెలివరీ చేస్తారని చెప్పారు. కాల్స్ అన్నింటినీ రిసీవ్ చేసుకుని అందులో గత మూడు నాలుగు రోజుల లోపు ఆర్టీపీసీఆర్ టెస్ట్ గానీ ఇతర కోవిడ్ టెస్ట్ ల ద్వారా కోవిడ్ రిపోర్ట్ తీసుకొన్న వారికి మాత్రమే సహాయం చేస్తున్నామంటున్నారు.
కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయని, కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా, కోవిడ్ పేషెంట్లమని చెప్ఫి కాల్ చేస్తున్నారని.. దీంతో నిజమైన కోవిడ్ పేషెంట్లకు ఫుడ్ సప్లై చేయడం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారామె. గత మూడు నాలుగు రోజుల్లోపు రిపోర్ట్ వచ్చి ఉంటే దానిని చెక్ చేసుకుని మాత్రమే మా టీమ్ సభ్యులు ఫుడ్ అందిస్తున్నారని ఆమె చెబుతున్నారు.
రెండోదశ కరోనా కారణంగా కుటుంబాల్లోని వారందరూ వైరస్ బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నారీసేన ద్వారా ఇంటి వద్దకే ఉచితంగా భోజనం అందిస్తోంది అంటున్నారు. ఇలా గత వారం రోజులుగా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ ఆరు నుంచి ఏడు వేల మందికి మూడు పూటల భోజనం, టిఫిన్ అందించామంటున్నారు.