దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే ఇప్పటికే మహమ్మారి ప్రమాదం పూర్తిగా ముగిసినట్టు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓ వైపు కరోనా కేసులు తగ్గుతున్నా.. 1 నుంచి 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లల్లో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. పిల్లల్లో కరోనా యాక్టివ్ కేసులు పెరిగాయని ఎంపవర్డ్ గ్రూప్-1 (ఈజీ-1) వద్ద ఉన్న డేటా చెబుతోంది. నేషనల్ కొవిడ్ ఎమర్జెన్సీ స్ట్రాటజీలో భాగంగా ఎంపవర్డ్ గ్రూప్-1 పని చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాది మార్చి వరకు కరోనా యాక్టివ్ కేసుల్లో ఒకటి నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న పిల్లల శాతం 2.80గా ఉండగా.. ఆగస్టు నాటికి అది 7.04 శాతానికి చేరిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని ప్రకారం ప్రతీ వంద కరోనా కేసుల్లో.. ఏడుగురు పిల్లలే ఉంటున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈజీ-1 ఈ నివేదికను వెల్లడించింది. ఈ సమావేశానికి కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం)
పిల్లల్లో కరోనా యాక్టివ్ కేసులకు సంబంధించి 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టుకు సంబంధించిన గణాంకాలు ఇవి. కరోనా కేసుల్లో పిల్లల వస్తే శాతాల పరంగా మిజోరం (16.48 శాతం) అత్యధికంగా ఉండగా.. న్యూ ఢిల్లీ (2.25 శాతం) అత్యల్పంగా ఉంది. మేఘాలయ (9.35 శాతం), మణిపూర్ (8.74 శాతం), కేరళ (8.62 శాతం), అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ (8.2 శాతం), సిక్కిం (8.02), దాద్రా అండ్ నగర్ హవేలీ (7.69 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (7.38 శాతం).. వరుసగా మిజోరం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా కేసుల్లో పిల్లల శాతం దేశవ్యాప్తంగా సగటు 7.04 శాతంగా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
పుదుచ్చేరి (6.95 శాతం), గోవా (6.38 శాతం), నాగాలాండ్ (5.48 శాతం), అసోం (5.04 శాతం), కర్ణాటక (4.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.53 శాతం), ఒడిశా (4.18 శాతం), మహారాష్ట్ర (4.08 శాతం), త్రిపుర (3.54 శాతం), ఢిల్లీ (2.25 శాతం) రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా పిల్లల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
పెద్దల్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతుండడం కూడా పిల్లల్లో యాక్టివ్ కేసులు పెరగడానికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లల్లో పాజిటివిటీ రేటు గతంలోనూ ఎక్కువగానే ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం అవగాహన పెరిగి.. పిల్లలకు కూడా అధిక సంఖ్యలో టెస్టులు చేయిస్తుండడం కూడా.. వారిలో ఎక్కువ పాజిటివ్ కేసులు బయపడటానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)