AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. తాజాగా నమోదు అవుతున్న కేసులు చూస్తుంటే థర్డ్ వేవ్ ఎంటర్ అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సైతం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతోంది. అయితే ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల రేటును పరిశీలిస్తే.. సెకెండ్ వేవ్ కన్నా చాలా తీవ్రత ఉండేట్టు కనిపిస్తోంది..
తాజాగా ఏపీలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. రాష్ట్రంలో జనవరి 8 నుంచి.. అంటే శనివారం నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నారని… నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారని.. 50% ఆక్యుపెన్సీతో ధియేటర్లు రెస్టారెంట్లు, ఆఫీసులు నిర్వహిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. వైద్య రంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అన్ని జిల్లాల వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది.
అయితే ఈ పరిస్థితి రావడానికి చాలా వరకు ప్రజల్లో నిర్లక్ష్యం కారణం అవుతోంది. ప్రజలు ఎక్కడా కోవిడ్ రూల్స్ పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆదివారం సాధారణంగా మార్కెట్లన్నీ కిటకిటలాడుతాయి. జనం మార్కెట్లలో గుమి గూడుతారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకొని వెళ్లాలి.. కానీ అక్కడ ఒకరు ఇద్దరు మినహా అంతా మాస్క్ లేకుండానే తిరుగేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కి చికిత్స అందించే ఆస్పత్రులు వివరాలు ఇవే..
మొత్తం 236 కోవిడ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. ఐసీయూ బెడ్లు 3609 రెడీగా ఉన్నాయి.. అందులో నిండిన 87 బెడ్లు నిండగా.. 3522 ఖాళీలు ఉన్నాయి. ఆక్సిజన్ కలిగిన ఐసియు బెడ్ మొత్తం 15,962 అందుబాటులో్ ఉన్నాయి. అందులో 184 నిండిన బెడ్లు ఉండగా.. 15,778 ఖాళీగా ఉన్నాయి. 11277 జనరల్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 66 నిండగా, 11211 ఖాళీగా ఉన్నాయి. అలాగే 1690 వెంటిలేటర్లు రెడీగా ఉన్నాయి.