మూడో ప్రమాద హెచ్చరిక తప్పదా.. తొలి రెండు వేవ్ ల కంటే ఇది అంత ప్రమాదకరమా..? అవుననే అంటోంది తాజా నివేదిక.. నిర్లక్ష్యం మాటున ప్రయాణిస్తున్న ప్రజలకు అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తోంది. పెద్దల విషయంలోనే కాదు... పిల్లల కోసం కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సరిచూసుకొమ్మని హెచ్చరిస్తోంది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) సారథ్యంలోని నిపుణుల కమిటీ తాజా నివేదిక కరోనాపై కొత్త యుద్ధానికి సిద్ధం కమ్మని అలర్ట్ చేస్తోంది.
పెద్ద సంఖ్యలో పిల్లలు కరోనాకు గురైతే, అవసరమైన వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సహా వసతులే లేవని హెచ్చరించింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న పిల్లలకూ, దివ్యాంగులకు మున్ముందుగా టీకాలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక, కరోనాతో సహజీవనంలో సరికొత్త సమరానికి సిద్ధం కావాల్సింది మనమే అని తేల్చి చెప్పేసింది.
సాక్షాత్తూ కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వుల మేరకు డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ లాంటి పలువురు ప్రముఖ నిపుణులతో ఏర్పాటైన సంఘం ఇచ్చిన నివేదిక ఇది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జూలై చివరి వారంలో కరోనా ‘ఆర్’వ్యాల్యూ 0.96 నుంచి 1 పైగా పెరగడాన్ని బట్టి చూస్తే, థర్డ్‌వేవ్ ఇప్పటికే పడగ విప్పినట్టు అర్థమవుతోందని కూడా నిపుణుల నివేదిక పేర్కొంది.
మన దేశంలో 58.25 కోట్ల పైగా టీకా డోసులు వేశామని పాలకులు చెబుతున్నారు. అందులో 45.15 కోట్ల పైగా మొదటి డోసులే. మిగతా 13.10 కోట్లు రెండో డోసులు. దేశజనాభాలో 13.87 శాతం మందికే కరోనా టీకా రెండు డోసులూ వేయడం పూర్తయింది. అంటే, మన దేశంలో నూటికి 84 మందికి టీకాలు పూర్తిగా వేయ లేదు.. ఇది కూడా ఆందోళన పెంచే అంశమే..
చిన్నారులకు ముప్పుందని తాజా నివేదిక మళ్ళీ చెబుతున్న నేపథ్యంలో వాస్తవ గణాంకాలు నిర్లక్ష్యం పనికి రాదని నిద్ర లేపుతున్నాయి. ఇప్పుడే సరైన వైద్యు సదుపాయాలు లేక పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉంది. నివేదిక చెప్పినట్టు రేపు థర్డ్ వేవ్ వచ్చి భారీ సంఖ్యలో పిల్లలు కరోనా బారిన పడితే ప్రజారోగ్య రంగం కుప్పకూలడం ఖాయం.
తాజాగా 12 నుంచి 18 ఏళ్ళ లోపు పిల్లల కోసం మన దేశంలో తయారైన కొత్త టీకా కాస్త ఆశలు పెంచుతోంది.. పిల్లలకు తగ్గట్టే సూది లేకుండా వేసే ఈ మూడు డోసుల ‘జైకోవ్–డి’ టీకాకు నిజానికి 66 శాతం మేర సామర్థ్యం ఉంది అంటున్నారు. అత్యవసర వినియోగం కోసం భారత ఔషధ నియంత్రణ జనరల్ ఆమోదించింది. భారత్ బయోటెక్ తయారీ కోవ్యాగ్జిన్ తర్వాత ఈ కొత్త ‘జైడస్ క్యాడిలా’ మన దేశవాళీ రెండో టీకా కానుంది.