Andhra Pradesh Corona: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) భయం వదలడం లేదు. ప్రతి రోజూ వేయికి పైగా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఒకరోజు కేసుల సంఖ్య పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఓవరాల్ కేసుల సంగతి ఎలా ఉన్నా.. విద్యార్థుల్లో కరోనా సోకిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం.. తీవ్ర ఆందోళన పెంచుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించింది. అప్పటి నుంచి మళ్లీ ఏపీలో స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ లో కరోనా కేసులు బయటపడుతున్న తీరు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది.
తాజాగా విశాఖ జిల్లా జి.మాడుగుల బాలుర ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం భయపెట్టింది. 19 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆశ్రమ పాఠశాలకు అధికారులు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. స్కూలు పరిశారాలను శానిటైజ్ చేసి.. ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో కొన్ని గంటల ముందే విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం ఆర్ వి నగరం ప్రభుత్వ గిరిజన సంక్షేమం పాఠశాల లో, 6 గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 181 మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో వారి ఇంట్లో వాళ్లకు.. అలాగే ఇటీవల వారితో క్లోజ్ గా ఉన్నవారి శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు అధికారులు.
అంతకుముందు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలలో నిత్యం కరోనా కేసులు బయటపడుతున్నాయి. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూడా కరోనా కలకలం రేగింది. బొబ్బిలి పరిధిలోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పదిమంది నాలుగవ తరగతి విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఎంఈఓ లక్ష్మణ రావు తెలిపారు.
ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ ఏపీని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా ఒకటి రెండు జిల్లాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో నైట్ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించింది ఏపీ ప్ర్రభుత్వం. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయినా కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గడం లేదు. మధ్యమధ్యలో కేసులు సంఖ్య పెరుగుతుండడంతో భయం వెంటాడుతోంది.
అక్టోబర్ లో థర్డ్ వేవ్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్ లో విద్యార్థులపై కరోనా ప్రభావం చూపిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఏపీ లో పలువురు స్కూలు విద్యార్థులు కరోనా బారిన పడుతుండడం కలవర పెడుతోంది. కరోనా బారిన పడిన విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.