కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకే షాపులు తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. జన సంచారంపై ఎలాంటి ఆంక్షలు విధించకపోయినా.. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కోరుతోంది సర్కార్.
విశాఖ జిల్లాలో వ్యాపారులు సైతం ముందుగానే స్వచ్ఛంద లాక్ డౌన్ కు సిద్ధమయ్యారు. ఇప్పటికే షాపులను మధ్యాహ్నం మూసేస్తున్నారు. వారంతాల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. అలాగే వినియోగదారులు కరోనా నిబంధనలు పాటించకపోతే సరుకులు లేవని చెప్పేస్తున్నారు. దీంతో విశాఖలో చాలా ప్రాంతాలు ఇప్పుడు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి.
విశాఖ జిల్లాలోనే ప్రధాన పర్యాటక క్రేందమైన అరకులోయలో సంపూర్ణ లాక్డౌన్ అమలుచేసే దిశగా వర్తక సంఘం సన్నాహాలు చేస్తున్నది. మన్యంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో సంపూర్ణ లాక్డౌన్పై వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాల వారితో వర్తక సంఘం సభ్యులు సోమవారం చర్చలు జరిపారు.