బైక్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు మీ వాహన బీమా పాలసీ (Motor Insurance Policy) నిబంధనలు, షరతుల పట్ల కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఈ షరతులు ఒక్కో పాలసీలో ఒక్కో విధంగా ఉంటాయి. అందుకే ముందుగా పాలసీ డాక్యుమెంట్స్ లోని కండిషన్స్ క్షుణ్ణంగా చదవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఏదైనా దురదృష్టకరమైన పరిణామాలు ఎదురైనప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇటీవల ఒక పాలసీదారుడు హెచ్డీఎఫ్సీ ఎర్గో బీమా సంస్థ నుంచి యాక్సిడెంట్ క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు.. అది సెటిల్మెంట్ చేయడానికి తిరస్కరించింది. 150సీసీ ఇంజిన్ కంటే ఎక్కువ సీసీ వాడుతున్న బైక్‌లకు తాము కవరేజ్ అందించమని తేల్చిచెప్పింది. ఇంకా ఇలాంటి సాధారణ మినహాయింపులు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకే అవేంటో ఇప్పుడు చూద్దాం.
అలాగే రైడర్ మద్యం లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉండి రోడ్డు ప్రమాదంలో బాధితుడైతే.. ఇన్సూరెన్స్ వర్తించదు. కాలం చెల్లిన వాహనాల మెకానికల్, ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఖర్చులను కూడా క్లెయిమ్ చేయలేం. యుద్ధం, ఉగ్రవాద దాడులు వంటి బాహ్య కారకాల వల్ల కలిగే నష్టాలు కూడా ద్విచక్ర వాహన బీమా పాలసీ పరిధిలోకి రావు. అతివేగం కారణంగా కలిగే నష్టం లేదా నష్టాన్ని టూ-వీలర్ మోటార్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు.
అలాగే పాలసీదారుడి బైక్‌ను వేరొక వ్యక్తి నడిపినప్పుడు వాహనాలకు జరిగే నష్టానికి కూడా బీమా సంస్థ ఎలాంటి పరిహారం చెల్లించదు. వాహనం యజమాని ప్రమాదానికి గురైతే.. రిపేర్ ఖర్చును బీమా సంస్థ భరిస్తుంది. కానీ బైక్‌ని వేరొకరికి అప్పుగా ఇచ్చినట్లయితే ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయలేము. వీటిపై వాహనదారుడికి ఎలాంటి పరిహారం అందదు. ఒకవేళ వినియోగదారుడు తన బైక్ కీ(Key) పోగొట్టుకున్నా లేదా కీ మరచిపోవడం వల్ల వాహనం దొంగతనానికి గురైనా బీమా కంపెనీ డబ్బులు చెల్లించదు.
అందుకే తమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ పాలసీ తమకు ఉత్తమంగా అనిపిస్తుందో దానిని కొనుగోలు చేయడం ద్వారా అనూహ్య పరిణామాలు సమయంలో తక్షణ ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇక పాలసీలో వర్తించే నిబంధనలు, షరతుల ప్రకారం బీమా చేసిన వాహనం డ్యామేజ్ అయినప్పుడు లేదా దొంగిలించినప్పుడు.. కంపెనీలు ఇన్సూరెన్స్ చెల్లిస్తాయి.