ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఏ రకమైన సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. ప్రభుత్వం తరఫున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) జారీ చేసిన 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్యనే ఆధార్. UIDAI ఆధార్ హోల్డర్లకు అనేక రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. బ్యాంకింగ్ సేవల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ కీలకంగా మారింది. బ్యాంకింగ్ సంబంధిత సేవలను పొందాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌కి, ఆధార్ లింక్ చేయాలి.
ఆధార్ కార్డులను బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు సులభంగా లింక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏ ATM లేదా బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించకుండానే ఈ 12-అంకెల ఆధార్ కార్డ్ నంబర్ని ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు? అదెలాగంటారా? అయితే ఈ ప్రాసెస్ చూసేయండి.
* ఆధార్‌తో బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి? : UIDAI ప్రకారం.. ప్రజలు తమ ఆధార్ కార్డులను వారి బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు తప్పనిసరిగా లింక్ చేయాలి. ఆసక్తికరంగా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లు, స్మార్ట్ఫోన్లు లేనివారు, వైకల్యం ఉన్నవారు బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ వివరాలను చెక్ చేసుకునే అవకాశం కలిగింది.
ఆధార్ నంబర్ని ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99*99*1# అనే నంబర్‌కి డయల్ చేయాలి. అనంతరం ఆధార్ నంబర్లోని 12 అంకెలను ఎంటర్ చేయాలి. మరోసారి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది.అనంతరం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందుబాటులో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను ఫ్లాష్ SMS ద్వారా పంపుతుంది.
* ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ ఎలా లింక్ చేయాలి? : బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి ముందుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
* మొబైల్ బ్యాంకింగ్ ద్వారా : మొదట బ్యాంక్ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి. తర్వాత సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. అక్కడ వ్యూ/ ఆధార్ కార్డ్ డీటైల్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.