యాపిల్ (Apple) కంపెనీ తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఆపేసిన నేపథ్యంలో, ఆఫీస్‌కు రావడానికి ఉద్యోగులు కోవిడ్ నిర్ధారణ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇకనుంచి నేరుగా ఆఫీస్‌కు రావొచ్చని తాజాగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఉద్యోగులకు కాస్త ఊరట కలగనుంది.
* ఫిబ్రవరి నుంచే అమలు : ‘ఆఫీసుకు రావాలంటే కోవిడ్ టెస్ట్ తప్పనిసరి’ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ట్విటర్లో యాపిల్ ప్లాట్‌ఫార్మర్ ప్రకటించింది. కోవిడ్ 19 పాలసీని సవరించేందుకు యాపిల్ సన్నద్ధమవుతున్నట్లు ట్వీట్లో పేర్కొంది. ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చే ముందు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్న తప్పనిసరి నిబంధనను ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
అధికారికంగా కోవిడ్ టెస్టింగ్ పాలసీ ఈ నెల(జనవరి) 30న, సిక్ లీవ్ పాలసీ ఆగస్టులో ముగుస్తుంది. అనంతరం ఈ ఐదు రోజుల సెలవు నిబంధన వర్తిస్తుందని యాపిల్ కంపెనీ ట్విటర్లో స్పష్టం చేసింది. అయితే, మునపటిలా కాకుండా కోవిడ్ పాజిటివ్ అని తేలితేనే ఉద్యోగికి గరిష్ఠంగా 5 రోజుల పాటు సెలవు ఇవ్వనున్నట్లు అందులో నొక్కి చెప్పింది.
* వారానికి 3 రోజులు : 2019లో కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా వ్యాపించింది. దీంతో యాపిల్ కంపెనీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఇచ్చింది. ఇలా దాదాపు రెండేళ్ల అనంతరం మళ్లీ ఆఫీసులను తెరిచింది. 2022 ఏప్రిల్‌లో ఉద్యోగులను యాపిల్ కంపెనీ ఆఫీసులకు ఆహ్వానించింది. మొదటగా వారానికి ఒక రోజు ఆఫీసుకి వస్తే చాలని ఉద్యోగులకు సూచించింది. ఆ మరుసటి నెలలో వారానికి రెండు రోజులు రావాలని నిబంధన పెట్టింది. గతేడాది సెప్టెంబరు నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీసుకి వచ్చేలా హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌ను అమలు చేస్తోంది.