ఆర్థిక మాంద్యం పుణ్యమా అని సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), విప్రో (Wipro) వంటి ప్రముఖ సంస్థలే ఉద్యోగులను తొలగించడంతో పాటు, లేఆఫ్‌లతో భారీగా కోతలు విధిస్తున్నాయి. ఫ్రెషర్ల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆఫర్ లెటర్ వచ్చిందన్న సంతోషమే తప్ప ఎప్పుడు జాబ్‌కి పిలుస్తారో.. అసలు పిలుస్తారో లేదో తెలియట్లేదు.
* ఏమిటా నిర్ణయం? : విప్రో తమ కంపెనీలో జాయిన్ అయ్యే ఫ్రెషర్లకు రెండు కేటగిరీలుగా విభజించి ప్యాకేజీలు ఆఫర్ చేస్తోంది. ఎలైట్ కేటగిరీలో వాళ్లకు ఏడాదికి రూ.3.5 లక్షల ప్యాకేజీ, టర్బో కేటగిరీ వాళ్లకు ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీ ఆఫ్ర్ చేస్తోంది. వెలాసిటీ ప్రోగ్రామ్ ద్వారా ఎలైట్ కేటగిరీలో ఉన్న వాళ్లు తమ స్కిల్స్ పెంచుకుంటే రూ.6.5 లక్షల ప్యాకేజీ అందుకోవచ్చు. ఈ మేరకు చాలామంది ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు.
తీరా ఇప్పుడు మీ ప్యాకేజీలో సగం తగ్గించుకోవాలని కంపెనీ యాజమాన్యం ఫ్రెషర్లకు మెయిల్స్ పంపుతోంది. అలా తగ్గించుకుంటే వెంటనే జాయిన్ అవ్వొచ్చని.. లేదు ముందు ప్యాకేజీయే కావలంటే కొంతకాలం వెయిట్ చేయమని చెబుతోంది. దీనిపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రూ.6.5 లక్షల ప్యాకేజీ కోసమని తమకు వచ్చిన వేరే ఆఫర్లు వదులుకుని వెయిట్ చేస్తున్నామని, తీరా ఇప్పుడు సగం తగ్గించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
* కేంద్రానికి లేఖ : దీనిపై ది నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) అనే ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భూపేందర్ సింగ్‌కు ఓ లేఖ కూడా రాసింది. బోర్డింగ్ తేదీ ఇవ్వకపోవడంతో పాటు, ప్యాకేజీ తగ్గించుకోమంటున్నారని అందులో రాసింది. దాంతో పాటు ‘2021 సెప్టెంబర్- 2022 జనవరి మధ్య విప్రో కొంతమందికి ఆఫర్ లెటర్లు ఇచ్చింది.
వారికి శిక్షణ ఇచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు చెల్లించమంది. లేనిపక్షంలో మూడునెలల పాటు ఫ్రీగా ఇంటర్న్‌షిప్ చేయాలని చెప్పింది. 2022 ఏప్రిల్‌లో ఇంటర్న్‌షిప్ మొదలుపెట్టగా జులైలో ముగిసింది. ఆగస్టులో వారు ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు అవ్వలేదు. కంపెనీ వారి బోర్డింగ్ తేదీని వాయిదా వేస్తూనే ఉంది.’ అని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు ఓ నివేదిక తెలిపింది.