ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్లు అస్థిరంగా ఉన్నాయి. డబ్బు పొదుపు చేసిన వారికి పెరుగుతున్న వడ్డీ రేట్లు మేలు చేస్తున్నా.. రుణాలు తీసుకున్న వారికి భారమవుతున్నాయి. అనేక ఇతర దేశాలలో రెగ్యులేటర్ల కంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచుగా రేట్లు పెంచుతోంది. తాజాగా కూడా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
* ఫిక్స్డ్ డిపాజిట్స్ ల్యాడరింగ్ స్ట్రాటజీ? : ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే సీనియర్ సిటిజన్లు పెరుగుతున్న రేట్ల వల్ల అధిక లాభాలు అందుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్న వడ్డీ రేట్ల నుంచి మరింత ప్రయోజనం పొందేందుకు ఎఫ్డీ ల్యాడర్ వ్యూహాన్ని ఉపయోగించడం బెస్ట్ ఆప్షన్.
ఉదాహరణకు ఓ వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో రూ.15,000 ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు. ఈ మొత్తం ఉపయోగించి మూడు వేర్వేరు ఎఫ్డీ అకౌంట్లు ఓపెన్ చేయాలి. రూ.15,000ని మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్క దానిలో రూ.5000 వంతున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. మూడు అకౌంట్ల మెచ్యూరిటీ పీరియడ్ వరుసగా 12 నెలలు, 15 నెలలు, 18 నెలలు ఉండేలా చూసుకోవాలి.
* అవసరాలకు విత్‌డ్రా చేసిన నష్టం ఉండదు? : దీర్ఘకాలిక FD కోసం చూస్తుంటే, ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌కి అందే 6.35 శాతం రేటుపై ఆసక్తి చూపవచ్చు. అయితే వచ్చే ఏడాది లేదా రెండు సంవత్సరాల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో FD ల్యాడర్ ప్లాన్ అమలు చేయడం మేలు. రికరింగ్ లిక్విడిటీని అందుకుంటారు.
లిక్విడిటీని మ్యానేజ్ చేయడానికి రూ.20 లక్షలను ఒకే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయడం కంటే.. ఐదు భాగాలుగా విభజించి, వివిధ టెన్యూర్స్‌లో మెచ్యూర్ అయ్యేలా రూ.4 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఏదైనా అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు, ప్రీ మెచ్యూర్‌గా విత్‌డ్రా చేయాల్సి వస్తే ఒక్క చిన్న ఎఫ్డీని తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఎఫ్‌డీల ఆదాయంపై ఎలాంటి ప్రభావం కనిపించదు.
* లిక్విడిటీ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు : రేటును ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. ఎఫ్డీ ల్యాడర్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత వడ్డీల పెరుగుదల, తగ్గుదల గురించి ఆందోళన అవసరం లేదు. వివిధ రేట్లు కలిగిన ప్రత్యేక FDలు వివిధ కాలాల్లో మెచ్యూర్ అవుతాయి కాబట్టి, లభించే వడ్డీని యావరేజ్ చేసుకోవాలి. ఎఫ్డీ ల్యాడర్ ప్లాన్ అమలు చేసినప్పుడు సాధారణ లిక్విడిటీ అవకాశాలతోపాటు విభిన్న వడ్డీ రేట్లు నుంచి ప్రయోజనాలు అందుకుంటారు.