సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బడ్జెట్, పార్లమెంటు ముందుకు రానే వచ్చింది. బడ్జెట్లో తమకు ఏదైనా ఊరట కలుగుతుందేమోనని సగటు ఉద్యోగులు.. వ్యాపార సరళీకరణకు ఏవైనా కొత్త నిబంధనలు తీసుకొస్తారేమోనని కొత్తగా కంపెనీలు పెట్టబోయే వ్యాపారులు, ఇన్వెస్టర్లు తదితర వర్గాల వారు ఎదురుచూశారు.
దీంతో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనికి స్వస్తి పలికేందుకు నేషనల్ సింగిల్ విండో సిస్టంగా ఏదైనా సంస్థను గుర్తించాలంటే పాన్‌కార్డు ఒక్కటి ఉంటే సరిపోయేలా కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇప్పుడు పాన్ కార్డుతోనే అన్ని రకాల వ్యాపార అనుమతులు తీసుకోవడంతో పాటు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
* గందరగోళానికి స్వస్తి : ప్రస్తుతం వివిధ రకాల కార్యకలాపాల కోసం పాన్‌కార్డుతో పాటు, ఈపీఎఫ్‌వో (EPFO), జీఎస్టీఎన్ (GSTN), టిఐఎన్ (TIN), టీఏఎన్ (TAN), ఈఎస్ఐసీ (ESIC) లాంటి 13 నుంచి 20 రకాల ఐడీలు వేర్వేరు సందర్భాల్లో ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది. వీటి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో సదరు వ్యక్తులు, పెట్టుబడిదారులకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది.
దీనికి చెక్ పెడుతూ ఫైనాన్స్ యాక్ట్ 2023 కింద ఒక్క పాన్‌కార్డు నంబరుతోనే చట్టబద్ధత పొందేలా 2023-24 బడ్జెట్లో ప్రకటించారు. ఈ మార్పుతో ఏదైనా వ్యాపారం నిర్వహించడం లేదా కొత్తది ప్రారంభించడం సులువు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలపై భారం తగ్గడంతో పాటు చాలా సమయం ఆదా అవుతుందని అంటున్నారు.
* పన్ను చెల్లింపులకు పాన్‌కార్డు : పాన్‌కార్డు అనేది కేంద్ర ఆదాయ పన్ను శాఖ (Income Tax department) జారీ చేసే 10 అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ నంబరు. ఇది వ్యక్తులకు, సంస్థలకు జారీ చేస్తుంది. పారదర్శక పన్ను చెల్లింపు విధానానికి పాన్‌కార్డును తీసుకొచ్చారు. దీని ఆధారంగానే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానం మరింత పారదర్శకంగా జరిగేందుకు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలనే నిబంధన కూడా విధించారు. బ్యాంకులో ఎక్కువ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేందుకు పాన్‌కార్డు (PAN) తప్పనిసరి. అలాగే ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఆదాయ పన్ను చెల్లించాలన్నా కూడా పాన్‌కార్డు కావాల్సిందే. ఇకపై ఇది మరింత కీలకం కానుంది.