1. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ (Credit Card) గురించి తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి లేదు. చాలామంది ఈ కార్డులను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్న క్రెడిట్ కార్డు సంస్థలు, వినియోగదారులను ఆఫర్లతో (Credit Card Offers) ఆకర్షిస్తున్నాయి. రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లాంటి ప్రయోజనాలతో బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే క్రెడిట్ కార్డు రీపేమెంట్ విషయంలో కస్టమర్లు జాగ్రత్త వహించాలి. కానీ ఇష్టమొచ్చినట్లు కార్డుతో కొనుగోలు చేసి రీపేమెంట్ చేసే సామర్థ్యం లేకపోతే మాత్రం వినియోగదారులు నష్టపోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా కొంచెం మొత్తం రుణం అయితే తిరిగి చెల్లించవచ్చు, కానీ అధికమొత్తమైతే క్రెడిట్ కార్డు మిమ్మల్ని అప్పులపాలు చేస్తుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డు బిల్లులపై ఛార్జీలు, జరిమానాలు భారీగా ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మిమ్మల్ని ఆర్థిక సంక్షోభంలోకి కూడా నెట్టేసే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. క్రెడిట్ కార్డుతో చేసిన తాజా లావాదేవీలతో పాటు చెల్లించని బకాయిలపై ఏడాదికి 40 శాతం వరకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం బకాయిలతో పాటు ఫెనాల్టీలు కూడా అదనంగా ఉంటాయి. అలాగే క్రెడిట్ కార్డ్ లోన్ మీ క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అవకాశముంటుంది. ఫలితంగా మీరు భవిష్యత్తులో రుణం తీసుకునేందుకు ఇది ప్రతికూలంగా మారవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉదాహరణకు మీరు సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే క్రెడిట్ కార్డు రుణం దానిపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పేలవమైన క్రెడిట్ స్కోర్ వల్ల హోంలోన్ అంత సులభంగా దొరకదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
5. క్రెడిట్ కార్డులను జారీ చేసే చాలా సంస్థలు పెండింగ్ బకాయిలను ఈఎంఐలుగా మార్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అదే విధంగా మీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం ఎక్కువ కాలం పాటు పెద్ద మొత్తాన్ని చిన్న భాగాలుగా చెల్లించవచ్చు. ఇందుకు సదరు క్రెడిట్ కార్డు అందించే బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. అది కూడా మీ ఈఎంఐలో భాగమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే ఈ వడ్డీ రేటు ఫైనాన్స్ ఛార్జీల కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సులభంగా మీరు చెల్లించవచ్చు. అంతేకాకుండా ఈఎంఐల ద్వారా బకాయిని తిరిగి చెల్లించడానికి మీరు ఎంచుకున్న కాల వ్యవధి ప్రకారం వడ్డీ రేటు మారవచ్చు. సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలోనే తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే వీటిపై వడ్డీ తక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ద్వారా మీ ప్రస్తుత క్రెడిట్ కార్డు బకాయిలను మరో క్రెడిట్ కార్డు ప్రొవైడర్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సమయంలో బకాయి మొత్తంపై తక్కువ వడ్డీ ఉంటుంది. కొన్నిసార్లు క్రెడిట్ కార్డు ప్రొవైడర్లు బ్యాలెన్స్ బదిలీపై టీజర్ రేటును కూడా అందిస్తారు. అంటే ఇందులో మీరు నిర్దిష్ట కాలానికి కనీస వడ్డీ రేటును చెల్లించాలి. ఈ వ్యవధిలోపు మీ క్రెడిట్ కార్డు మొత్తం బ్యాలెన్స్ ను చెల్లించగలిగితే, మరో క్రెడిట్ కార్డు ప్రొవైడర్ కు ప్రయోజనకరంగా ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. మీ క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడానికి వ్యక్తిగత రుణం తీసుకోవడం మరో ఆప్షన్. క్రెడిట్ కార్డ్ లోన్ ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు జారీ చేసేవారు దాదాపు ఏడాదికి 40 శాతం వడ్డీని వసూలు చేస్తారు. అయితే మీరు 11 శాతానికే వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. కానీ పెద్ద మొత్తంలో బకాయి ఉన్నవారు తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణం పొందేందుకు అర్హులు కాలేరు. అర్హత ఉన్నవారికి క్రెడిట్ స్కోరు పెద్దగా ప్రభావితం కానందున పర్సనల్ లోన్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఈ విధంగా వారు తమ క్రెడిట్ కార్డు లోన్ ను క్లియర్ చేసుకోవచ్చు. అయితే మరోసారి అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే నెలవారీగా ఈఎంఐలను బాధ్యతాయుతంగా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)