1. దేశంలో ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు మరోసారి పెరగనున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రీ-ఇన్సూరెన్స్ రేట్లు పెరగడంతో బీమా ప్రీమియం ధరలను 25-45 శాతం మేరకు పెంచేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ కారణంగా అధిక మరణాల రేటు నమోదైన నేపథ్యంలో అనేక కంపెనీలు నష్టాలను చవిచూశాయి. దీంతో నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పటికే ప్రీమియం ధరలను పెంచాయి. ఈ క్రమంలో డిసెంబర్ నుంచి మరోసారి ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెంచనున్నట్లు బీమా కంపెనీలకు తెలియజేసింది ఇంటర్నేషనల్ రీఇన్సూరర్ మ్యూనిచ్ రీ (Munich Re) సంస్థ. డిసెంబర్ నుంచి పెరిగిన రేట్లు వర్తిస్తాయని తెలిపింది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా, మరికొన్ని సంస్థలు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి భారీగా కాకుండా కొంత మొత్తంలోనే ధరలు పెంచాలని బీమా సంస్థలు రీఇన్సూర్లతో చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ధరలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ‘ఈ విభాగంలో ప్రీమియంలు ఇప్పటికే 30-100 శాతం పెరిగాయి. వ్యక్తిగత టర్మ్ రేట్లు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇండివిడ్యువల్ టర్మ్ ప్రీమియం రేట్ల పెరుగుదలకు సంబంధించి రెగ్యులేటరీ అప్రూవల్ ప్రాసెస్ ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే బీమా సంస్థలు ఇంకా ధరల పెంపును ఆమోదించలేదు. అయితే ధరలు కచ్చితంగా పెరుగుతాయి’ అని చెబుతున్నారు బ్రోకింగ్ పోర్టల్ Securenow.in మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ అభిషేక్ బోండియా. (ప్రతీకాత్మక చిత్రం)
4. భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి బీమా కంపెనీలు ప్రీమియం ధరలు పెంచుతున్నాయి. అయితే ఈసారి ప్రీమియం రేట్ల పెరుగుదల గణనీయంగా ఉండవచ్చు. గత 10 సంవత్సరాలుగా దేశంలో తక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ రేట్లు అమల్లో ఉన్నాయి. గత సంవత్సరం నుంచి బీమా ప్రీమియం రేట్లు దాదాపు 10-15 శాతం పెరిగాయి. ప్రస్తుతం మరోసారి ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈసారి రీఇన్సూరెన్స్ రేటు పెరుగుదలను కంపెనీలు పాలసీదారులకు అన్వయిస్తే, ధరలు భారీగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రతిఒక్కరూ తీసుకోవడం మంచిదని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు. ప్రస్తుత బీమా కవరేజీ సరిపోకపోతే దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ‘చాలా తక్కువమంది భారతీయులు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. బీమాను పెట్టుబడి కోసం, పన్ను ఆదా చేసుకోవడానికి మాత్రమే కొనుగోలు చేస్తారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంపై చాలామంది దృష్టిపెట్టరు. దీంతో హామీ మొత్తం మనకు అవసరమైన దానిలో సగం కంటే తక్కువగా ఉంటుంది. త్వరలో బీమా కంపెనీలు ప్రీమియం రేట్లను పెంచే అవకాశం ఉన్నందున, ప్రస్తుత అవసరాలను పునఃపరిశీలించుకోవాలి. అదనంగా కవరేజీ కావాలంటే వెంటనే యాడ్ ఆన్ పాలసీలు తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ఇన్వెస్టగ్రఫీ వ్యవస్థాపకురాలు శ్వేత జైన్. (ప్రతీకాత్మక చిత్రం)
7. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల పెంపునకు ప్రధాన కారణం కోవిడ్-19 మరణాలు అని చెప్పుకోవచ్చు. మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. ఇప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో.. మరోసారి కంపెనీలు ధరలు పెంచకముందే టర్మ్ పాలసీలను కొనుగోలు చేయడం మంచిది. ఒకసారి టర్మ్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, టర్మ్ రేట్లు పాలసీ గడువు మొత్తం ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న తక్కువ ధరలకే పాలసీలు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)