అవసరానికి అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు ఉపయోగించడం జీవితంలో భాగమే. అయితే అలా అవసరానికి చేసే అప్పులు ముప్పుతిప్పలు పెడతాయని ఎవరూ ఊహించరు. ఏదైనా హద్దులు దాటితే సమస్యలు తప్పవు. అప్పులైనా, క్రెడిట్ కార్డు వినియోగమైనా మీ ఆదాయానికి అనుగుణంగా ఉండాలే తప్ప... ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా వాడేస్తే సమస్యల్లో చిక్కుకున్నట్టే. ఎక్కువగా అప్పులు చేస్తూ పోతే చివరకు మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టే. అయితే మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నట్టు ముందుగానే ఊహించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
మీ ఆదాయమంతా అప్పులు చెల్లించేందుకే సరిపోతోందా : మీకు వచ్చే ఆదాయంలో 30% శాతానికి మించి అప్పుల కోసం కేటాయించొద్దు. ఆదాయంలో 30% కన్నా ఎక్కువ అప్పులు చెల్లించేందుకు ఖర్చు చేస్తున్నారంటే... మీరు అప్పుల ఊబివైపు వెళ్తున్నట్టే. ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ ఉన్నట్టైతే మీ ఆదాయంలో 40% వరకు కేటాయించొచ్చు. కానీ ఇంతకు మించినట్టు కనిపిస్తే మీకు హెచ్చరికలు జారీ అవుతున్నట్టే. (ప్రతీకాత్మక చిత్రం)
నెలవారీ ఖర్చులకు కూడా అప్పులు చేస్తున్నారా : మీకు వ్యాపారంలో లాభాలు, వేతనం, పెన్షన్, వడ్డీల రూపంలో ఆదాయం వస్తుంటుంది. ఇవన్నీ మీ నెలవారీ ఖర్చులకు ఉపయోగిస్తుంటారు. అయితే మీ నెలవారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు తీవ్రమైన సమస్యల్లో ఉన్నట్టే. ఎందుకంటే మీరు ఎక్కువగా అప్పులపైన ఆధారపడుతున్నారని అర్థం. దీంట్లోంచి బయటపడాలంటే మీరు ఖర్చులు తగ్గించుకోవడం ఒక మార్గం అయితే... ఆదాయాన్ని పెంచుకోవడం మరో మార్గం.
క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోతున్నారా : క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోతే మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నట్టే. మీరు బ్యాంకుల్లో తీసుకునే రుణాలకన్నా క్రెడిట్ కార్డు బిల్లుపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఒక నెల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేదంటే ఆ తర్వాత ఫైన్, వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఇలా మీరు వాడుకున్నదానికన్నా అదనంగా చెల్లించేదే ఎక్కువవుతుంది. అనుకోని ఖర్చులతో ఒకట్రెండు నెలలు ఈ పరిస్థితి ఏర్పడితే సర్దుకోవచ్చు కానీ... పదేపదే ఇదే పరిస్థితి ఎదురవుతోందంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో లోపం ఉన్నట్టే.
ఉన్న అప్పులు చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేస్తున్నారా : బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మంచి ఆప్షన్ అని అనుకుంటారు చాలామంది. కొంచెం ఫీజు చెల్లించి ఔట్స్టాండింగ్ని ఒక కార్డు నుంచి మరో కార్డుకు చెల్లించొచ్చు అని భావిస్తారు. ఇది కేవలం మీరు కొంత గడువు కోసం ఫీజు చెల్లించడం మాత్రమే. మీరు చెల్లించాల్సిన అప్పు అలాగే ఉంటుంది. ప్రతీసారీ ఇలా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్తో కాలం గడిపేస్తున్నారంటే అప్పుల ఊబిలో ఉన్నారనే అర్థం.
ఏ బ్యాంకూ మీకు లోన్ ఇవ్వట్లేదా : మీరు లోన్ ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ముందుకు రావట్లేదంటే మీ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దం పట్టే సందర్భమే అది. ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా ఉంటే... ఏ బ్యాంకూ అప్పు ఇవ్వదు. గతంలో మీరు తీసుకున్న అప్పులు సరిగ్గా చెల్లించకపోయినా, ఈఎంఐలు గడువులోకా కట్టకపోయినా మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఆ తర్వాత కొత్త అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు.
అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఏం చేయాలి : అది ఇల్లైనా, రాష్ట్రమైనా బడ్జెట్ ప్లానింగ్ తప్పనిసరి. ముందుగా మీ ఇంటి బడ్జెట్ ఎంతో లెక్కేసుకోవాలి. అందులో వృథా ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోవాలి. వీలైతే ఆ ఖర్చుల్ని ఆపెయ్యాలి. మీకు వేర్వేరు మార్గాల్లో వస్తున్న ఆదాయం ఎంతో లెక్కించాలి. మీ ఖర్చు కన్నా ఆదాయం తక్కువగా ఉన్నట్టైతే ఏదో ఓ రోజు మీరు అప్పుల పాలవడం తప్పదు. ఖర్చులు తగ్గించుకొని పొదుపుపై దృష్టిపెట్టాలి. మీ ఆదాయంలో కనీసం 30% పొదుపు చేస్తుండాలి. ఆదాయం, ఖర్చులు సమానంగా ఉన్నాయి కదా... జీవితానికి ఏ ఢోకా లేదు అని అనుకోవద్దు. ఏ ఖర్చు ఎప్పుడెలా వస్తుందో ఊహించడం కష్టం. మీ బడ్జెట్లో పొదుపు అనేది తప్పనిసరి. బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయని తీసుకోకూడదు. మీకు అవసరం ఉంటేనే లోన్ తీసుకోండి. చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా వాడకూడదు.