SBI Home Loan Offer | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. వడ్డీ రేటులో రాయితీ సదుపాయం కల్పిస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంక్ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంచింది. అందువల్ల లోన్ (Loan) తీసుకోవాలని భావించే వారు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు.
హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఎస్బీఐ తీపికబురు అందించింది. రుణాలపై వడ్డీ రేటులో 15 బేసిస్ పాయింట్ల నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు అందిస్తోంది. అక్టోబర్ 4 నుంచి 2023 జనవరి 31 వరకు ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా ఆఫర్ కొనసాగుతుంది.
ఎస్బీఐ రెగ్యులర్ హోమ్ లోన్స్‌పై (ఫ్లెక్సీ పే, ఎన్ఆర్ఐ, నాన్ శాలరీడ్, శౌర్య, ఆప్నా ఘర్ వంటివి) వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. సిబిల్ స్కోర్ 800 లేదా ఆపైన ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. అంటే 15 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. మీ క్రెడిట్ స్కోర్ ఎంత అనే అంశం ప్రాతిపదికన మీ వడ్డీ రేటు నిర్ణయం అవుతుంది. 699 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఎక్కువ వడ్డీ చెల్లించుకోవాల్సి రావొచ్చు. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. వీరికి 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గుతుంది.
అదే ఎస్బీఐ టాప్ అప్ హోమ్ లోన్స్ విషయానికి వస్తే.. ఎస్బీఐ పండుగ సీజన్లో ఈ రుణాలపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేసింది. 700 నుంచి 800 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. 800 లేదా ఆపైన క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేటు 8.8 శాతంగా ఉంటుంది. 750 నుంచి 799 మధ్యలో సిబిల్ స్కోర్ ఉంటే 8.9 శాతంగా, 700 నుంచి 749 మధ్యలో సిబిల్ స్కోర్ ఉంటే 9 శాతం వడ్డీ పడుతుంది.
ప్రాపర్టీ తనఖా పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. వీరికి వడ్డీ రేటులో 30 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తోంది. 800 లేదా ఆపైన సిబిల్ స్కోర్ ఉంటే.. 10.3 శాతం కాకుండా 10 శాతానికే లోన్ పొందొచ్చు. 750 నుంచి 799 మధ్యలో సిబిల్ స్కోర్ ఉంటే వడ్డీ రేటు 10.1 శాతంగా పడుతుంది. 700 నుంచి 749 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే 10.2 శాతానికి రుణం పొందొచ్చు.