1. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లల్లో ప్రయాణించేవారి కోసం ప్రత్యేకమైన ప్రయాణ సూచనలు (Travel Advisory) జారీ చేసింది. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకుంటోంది దక్షిణ మధ్య రైల్వే. అందులో భాగంగా పలు జాగ్రత్తలను సూచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రయాణికులు ఈ రైళ్లల్లో కర్పూరం వెలిగించకూడదని తెలిపింది. దీంతో పాటు అగరబత్తీలను కూడా వెలిగించొద్దని హెచ్చరించింది. రైల్వే స్టేషన్ ఆవరణతో పాటు రైలు బోగీలో ఇలాంటివి చేయొద్దని తెలిపింది. రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో మండే స్వభావం గల పదార్థాలను వెలిగించడంపై ఇప్పటికే నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇలాంటి చర్యల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలగడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా ముప్పు ఉంటుంది. రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 67, 154, 164, 165 ప్రకారం ఇలాంటి కార్యకలాపాలన్నీ శిక్షార్హమైన నేరాలు. ఈ చర్యలకు పాల్పడేవారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి. దీంతో పాటు ఎవరికైనా గాయాలైనా, నష్టం కలిగినా అందుకూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీంతో పాటు రైల్వే ప్రయాణికులు కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. రైల్వే స్టేషన్ ఆవరణలో, రైళ్లల్లో మాస్కులు ధరించాలి. ఇతర ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అనవసరంగా గుమికూడకూడదు. రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), కమర్షియల్ బ్రాంచ్ల సిబ్బంది నిఘా పెడుతున్నారని రైల్వే తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. శబరిమల వెళ్ల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జనవరి మూడోవారం వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 16 నుంచి కొన్ని రైళ్లు, డిసెంబర్ 18 నుంచి కొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య 2021 డిసెంబర్ 18న, కొల్లాం నుంచి సికింద్రాబాద్ మధ్య 2021 డిసెంబర్ 19న, కాచిగూడ నుంచి కొల్లాం మధ్య 2021 డిసెంబర్ 22న, కొల్లాం నుంచి కాచిగూడ మధ్య 2021 డిసెంబర్ 23న, నాందేడ్ నుంచి కొల్లాం మధ్య 2021 డిసెంబర్ 23న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైలు నెంబర్ 07506 కొల్లాం నుంచి తిరుపతి మధ్య 2021 డిసెంబర్ 25న, రైలు నెంబర్ 07138 తిరుపతి నుంచి నాందేడ్ మధ్య 2021 డిసెంబర్ 26న అందుబాటులో ఉంటుంది. శబరిమల వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లకు టికెట్ బుకింగ్ కూడా ప్రారంభమైంది. ఈ రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)