దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఉత్సవ్ డిపాజిట్’ అనే కొత్త టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్ 1,000 రోజుల డ్యూరేషన్‌తో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) అందుబాటులో ఉంటుంది. 2022 ఆగస్టు 15 నుంచి 6.1 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ అందజేస్తుంది.
సీనియర్ సిటిజన్లు ప్రామాణిక వడ్డీ రేటు కంటే అదనంగా 0.50 శాతం వడ్డీని పొందుతారు. SBI ఈ స్పెషల్ ఆఫర్‌ను 2022 అక్టోబర్ 30 వరకు, 75 రోజుల పాటు అందిస్తోంది. అయితే ఇంతకుముందు బ్యాంక్ కొన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు ఆగస్టు 13 నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై కొత్త ఎఫ్డీ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. కొత్త మార్పుల ప్రకారం SBI ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 2.9 శాతం నుంచి 6.1 శాతం వరకు.. సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం నుంచి 6.6 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది.
గత వారం ప్రైవేట్ రంగ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఆగస్టు 11 నుంచి అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లను పెంచిన నేపథ్యంలో కొన్ని ఇతర బ్యాంకులు కూడా ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై FD రేట్లను పెంచాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : కొత్త వడ్డీరేట్ల ప్రకారం.. ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఎస్బీఐ గరిష్టంగా 5.65 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అదే కాలవ్యవధికి గరిష్టంగా 6.45 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఈ బ్యాంకు 7-45 రోజుల కాలవ్యవధికి 2.9 శాతం, 46-179 రోజుల డిపాజిట్లకు 3.9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు డిపాజిట్లపై 5.5 శాతం, మూడు సంవత్సరాల నుంచి ఐదేళ్ల లోపు డిపాజిట్లపై 5.6 శాతం రాబడి లభిస్తుంది.
* యాక్సిస్ బ్యాంక్ : ఆగస్టు 11న ప్రకటించిన వడ్డీరేట్ల పెంపు తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.5 నుంచి 6.05 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఒక సంవత్సరం 11 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల వడ్డీ రేట్లు; ఒక సంవత్సరం 25 రోజుల మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై వడ్డీరేట్లు 5.75 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం 25 రోజుల నుంచి రెండు సంవత్సరాల వరకు డిపాజిట్ల రేటు 5.6 శాతంగా ఉంటుంది. రెండు సంవత్సరాల నుంచి ఐదేళ్ల లోపు కాలవ్యవధికి బ్యాంక్ 5.7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అయితే 5-10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
* కోటక్ మహీంద్రా బ్యాంక్ : కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ఆగస్టు 10న ప్రకటించింది. ఇప్పుడు 7-14 రోజుల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీల రేట్లను మార్చకుండా 2.50 శాతంగానే ఉంచింది. అయితే 15-30 రోజుల ఎఫ్డీలపై వడ్డీని 2.50 శాతం నుంచి 2.65 శాతానికి పెంచింది. 31-90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సవరించిన రేటు 3 శాతం నుంచి 3.25 శాతానికి చేరింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్డీలపై 5.90 శాతంతో అత్యధిక వడ్డీ రేట్లను బ్యాంకు అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు వివిధ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.40 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
* యస్ బ్యాంక్ : ఆగస్టు 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఎఫ్డీ రేట్ల ప్రకారం.. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మెచూరిటీ ఉండే రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై యెస్ బ్యాంక్ 3.25 శాతం నుంచి 6.75 శాతం వరకు అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంకు అందించే ఎఫ్డీ రేట్లు 3.75 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉన్నాయి.