1. ఏప్రిల్లో జరిగిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2022 జూన్ 6 నుంచి 8 వరకు మళ్లీ మానెటరీ పాలసీ కమిటీ సమావేశం ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. కాబట్టి జూన్ వరకు వడ్డీ రేట్లు జూన్ వరకు పెరగవని మార్కెట్ వర్గాలు, బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ మే 4న ఆర్బీఐ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆకస్మికంగా ప్రెస్ మీట్ పెట్టి రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. సాధారణంగా వడ్డీ రేట్లను పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలా? అన్న నిర్ణయాన్ని ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో తీసుకుంటుంది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
3. కానీ ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా వడ్డీ రేట్ల పెంపును ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ కంఫర్ట్ జోన్ కంటే ఎక్కువగా ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం విశేషం. దీంతో వడ్డీ రేట్ల పెంపుపై రెండేళ్ల విరామానికి తెరపడ్డట్టైంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్బీఐ దశలవారీగా 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.50 శాతం వడ్డీ రేట్లు తగ్గించింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడానికే మొగ్గుచూపుతోంది. మే 4న వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ, జూన్ 6 నుంచి 8 మధ్య జరగోయే సమావేశంలో వడ్డీ రేట్లను మళ్లీ పెంచబోతోంది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ CNBC-TV18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచడం కొనసాగిస్తామని, రెపో రేటును కోవిడ్ కన్నా ముందు స్థాయికి పెంచుతామని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. రెపో రేటులో కొంత పెరుగుదల ఉంటుందని, ఎంత వరకు అన్న విషయం తాను చెప్పలేను కానీ 5.15 శాతానికి పెంచుతారనడం ఖచ్చితమైనది కాదన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. జూన్ 8న జరిగే సమావేశంలో ద్రవ్యపరపతి విధాన కమిటీ రేట్లను పెంచాలని మార్కెట్ ఆలోచించడం సరైనదని, రెండు-మూడేళ్లలో వ్యవస్థలో ద్రవ్యత ఎక్కువైందని, దాన్ని తగ్గించాలని ఆర్బీఐ కోరుకుంటోందని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ మాటల ప్రకారం జూన్ 8న రెపో రేట్ పెరగడం దాదాపు ఖాయమే. అయితే ఎంత పెరుగుతుందన్నది ఎదురుచూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)