1. మరో భారం మోసేందుకు సామాన్యులు సిద్ధం కావాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి రెపో రేట్ పెంచబోతోంది. ఆగస్ట్ మొదటివారంలో జరగబోయే ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో రెపో రేట్ పెంపుపై ఆర్బీఐ గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి రెపో రేట్ 35 బేసిస్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే ఆర్బీఐ ఈ ఏడాది రెండుసార్లు రెపో రేట్ పెంచింది. మే 4న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆకస్మికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 8న మరోసారి ఆర్బీఐ రెపో రేట్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 8న ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక ఆగస్ట్ మొదటివారంలో జరగబోయే సమావేశంలో 35 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరగొచ్చని అంచనా. అదే జరిగితే ఈ ఏడాదిలోనే 125 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెరిగినట్టు అవుతుంది. 100 బేసిస్ పాయిట్స్ అంటే 100 పైసలతో సమానం. 125 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరిగితే 125 పైసలు అంటే ఒక రూపాయి 25 పైసలు వడ్డీ రేటు పెరిగినట్టవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. తాజాగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 75 పైసలు వడ్డీ రేట్లు పెంచింది. జూన్ నుంచి జూలై మధ్య ఏకంగా 150 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను పెంచింది యూఎస్ ఫెడరల్ రిజర్వ్. 1980 తర్వాత అమెరికాలో ఈస్థాయిలో వడ్డీ రేట్లు పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రెపో రేట్లు అంటే వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలా? అనే నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఆర్బీఐ తీసుకుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి, దేశంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్బీఐ దశలవారీగా 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.50 శాతం వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు వడ్డీ రేట్లు పెంచుతోంది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. ప్రస్తుతం రెపో రేట్ 4.90 శాతంగా ఉంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఉదాహరణకు హోమ్ లోన్ కస్టమర్ రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకొని 7.5 శాతం వడ్డీతో హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరిగింది కాబట్టి వడ్డీ 8 శాతంగా లెక్కిస్తారు. దీంతో ఇప్పటికే చెల్లిస్తున్న హోమ్ లోన్ ఈఎంఐ కాస్త పెరుగుతుంది. అయితే వెంటనే కాకపోయినా మూడు నెలలకు ఓసారి వడ్డీ రీసెట్ చేస్తారు కాబట్టి త్వరలోనే ఈఎంఐ భారం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)