ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా కీలక సూచన చేసింది. ఎవరూ కూడా అకౌంట్ లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, కేవైసీ డాక్యుమెంట్ కాపీలు, కార్డు సమాచారం, పిన్, పాస్వర్డ్ మరియు ఓటీపీలను గుర్తు తెలియని వ్యక్తులకు గానీ, ఏజెన్సీలకు గానీ షేర్ చేయవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. అనధికార వెబ్సైట్లలో గానీ, గుర్తింపు లేని వెబ్‌సైట్స్‌లో గానీ ఈ వివరాలను పంచుకోవద్దని ఖాతాదారులను సెంట్రల్ బ్యాంకు అప్రమత్తం చేసింది.
అంతేకాదు.. కేవైసీ అప్డేషన్ పేరుతో అకౌంట్ వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న వాళ్లు కాల్స్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్‌తో ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ అప్డేషన్ అంటూ లింక్స్ పంపి ఖాతాదారులు ఒక్కసారి ఆ లింక్‌ను క్లిక్ చేయగానే అకౌంట్ వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఆర్బీఐ తెలిపింది.
ఆర్బీఐ గతంలో కూడా వినియోగదారులను పలు సందర్భాల్లో అప్రమత్తం చేసింది. అప్పట్లో పాత నోట్లు, పాత నాణేలు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని, తమకు ఆర్బీఐ అనుమతి కూడా ఉందని ప్రజలను అమాయకులను చేసి మోసం చేసే ప్రయత్నం చేశారు. తాము అలాంటి అనుమతులు ఏవీ ఇవ్వలేదని, ఆర్బీఐ పేరు వాడుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారని అప్పట్లో ఆర్బీఐ ట్వీట్ చేసి మరీ స్పష్టం చేసింది.