గడువు తీరితే అంతేనా: మీ కారుబీమా (car insurance) గడువు (Expired car insurance)తీరిందా. ఇక పాలసీని ఎలా పునరుద్ధరించాలా (insurance renew) అని దిగులు పడకండి. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు గడువు తీరిన తరువాత కూడా 15-30 రోజుల సమయాన్ని గ్రేస్ పీరియడ్ గా లెక్కించి, పాలసీ పునరుద్ధరణకు తోడ్పడతారు. మీ కారు బీమా పాలసీ గడువు తీరిన తరువాత కూడా మీరు బీమాను పునరుద్ధరించుకోని పక్షంలో కొత్త బీమా పాలసీ (new policy) తీసుకోక తప్పదు.
పాలసీ బజారుందిగా : పాలసీబజార్ కు (policy bazaar) చెందిన మోటార్ ఇన్సూరెన్స్ విభాగాధిపతి సజ్జా ప్రవీణ్ చౌధరీ ఇందుకు ఓ విరుగుడు సూచిస్తున్నారు. మోటారు ఇన్సూరెన్స్ పాలసీ గడువు తీరగానే తక్షణం ఇన్సూరెన్సు కంపెనీకి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వెంటనే సదరు కంపెనీ తరపున వాహన సర్వే కోసం అపాయింట్మెంట్ ఇస్తారు. ఆవెంటనే మీరున్న చోటికి మోటార్ సర్వేయర్ (motor surveyor)వచ్చి కారు పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తారు. ఇందులో భాగంగా గతంలో కారుకు ఏమైనా డెంట్లు పడ్డాయా, ప్రమాదానికి గురైందా, ఇన్సూరెన్సు క్లెయిమ్ చేసుకున్నారా వంటివన్నీ వివరంగా రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ ను బీమా కంపెనీకి సర్వేయర్ రిపోర్ట్ చేయగానే గడువు ముగిసిన బీమాను పునరుద్ధరించేందుకు అవసరమైన మొత్తాన్ని కట్టాల్సిందిగా కారు యజమానికి పేమెంట్ లింక్ (payment link) ఇస్తారు. దీంతో మీ కారుకు బీమా అనే ధీమా మళ్లీ దక్కినట్టే.
వేరే కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు: కానీ రెన్యువల్ చేసే సమయంలో కారుకు పెద్ద డ్యామేజీలున్నట్టు కనిపిస్తే మాత్రం గడువు ముగిసిన పాలసీని పునరుద్ధరించడం అస్సలు కుదరదు. ఇలా పునరుద్ధరించే సమయంలో కారు యజమాని వేరే బీమా కంపెనీని ఎంచుకోవచ్చు కూడా. పాత బీమా కంపెనీ సేవలు నచ్చనిపక్షంలో వేరే కంపెనీని ఆశ్రయించవచ్చు. ఎలాంటి కారణం లేకుండా కేవలం బీమా కంపెనీ మార్చలని అనుకున్నట్టయితే ఏ కంపెనీ మంచి సర్వీసు ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మోటారు బీమా పాలసీలపై మీకు పూర్తి అవగాహన ఉంటేనే ఆన్ లైన్లో పాలసీలు తీసుకోండి లేనిపక్షంలో బీమా కంపెనీ కాల్ సెంటర్ కు కాల్ చేస్తే చాలు ఆయా ఏజెంట్లు స్వయంగా మీవద్దకు వచ్చి వివరాలు తెలియజేసి, మీ సందేహాలను తీరుస్తారు.
ఆన్ లైన్లో డైరెక్టుగా: ఆన్ లైన్లో (online insurance) నేరుగా బీమా సంస్థ నుంచి బీమా పాలసీని తీసుకోవచ్చు. బీమా సంస్థలు తమ సొంత వెబ్ సైట్ ద్వారా పాలసీలను పునరుద్ధరించడం, కొత్త పాలసీలు ఇవ్వడం వంటివి విస్తృతంగా చేస్తున్నాయి. కోవిడ్ టైంలో ఇంటి నుంచి బయటికి కాలు కదపకుండా గడువు ముగిసిన మీ కారు పాలసీని ఆన్ లైన్లో ఒక క్లిక్ ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. మోటార్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డెక్కితే వేల రూపాయల చలానాలు (traffic chalans)చెల్లించాల్సి రావడమే కాదు అది వాహనాలు నడిపేవారికి, రోడ్డుపైన వెళ్లేవారికి కూడా ప్రమాదకరం.
పీయూసీ తప్పనిసరి: వాహన ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా కాలుష్య నిబంధలను కఠినతరం చేసేలా, వాహన భీమా పునరుద్ధరణ కోసం పీయూసీ తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) విడుదల చేసిన సర్క్యులర్‌లో, సాధారణ బీమా కంపెనీలు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. అంతేకాదు మోటారు భీమా పాలసీల పునరుద్ధరణ సమయంలో చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్‌ను బీమా కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. సరైన పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు బీమా కంపెనీలు మోటార్ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేయటం చట్టరీత్యా నేరం కనుక మీ కారుకు బీమా పునరుద్ధరించే సమయంలో పీయూసీ కూడా సరిచూసుకోవడం తప్పనిసరి.