కొంత కాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేటు (REPO Rate)ను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతంగా ఉంది. అయితే మరోసారి రెపో రేటును పెంచే యోచనలోనే ఆర్బీఐ ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
* రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు : రాయిటర్స్ పోల్లో మొత్తంగా 52 మంది ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. వీరిలో 40 మంది ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని, దీంతో రెపో రేటు 6.50 శాతానికి పెరుగుతందని అంచనా వేశారు. అయితే ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయదని మిగతా 12 మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు.
* ఫిబ్రవరి 6న కీలక సమావేశం : ఆర్బీఐ మానిటరీ కమిటీ ఫిబ్రవరి 6-8 తేదీల్లో సమావేశం కానుంది. పాలసీ వడ్డీ రేటుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. 2022 డిసెంబర్లో భేటీ అయినప్పుడు ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించింది. కాగా గతేడాది మే నుంచి ఇప్పటివరకు రెపో రేటును 2.25 శాతం పాయింట్లు పెంచింది.
* రెపో రేటు పెరిగితే పరిణామాలు : ఆర్బీఐ రెపో రేటును పెంచితే, ఫిక్స్డ్ డిపాజిట్స్, రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు మే నుంచి RBI పాలసీ ఫలితాలకు అనుగుణంగా తమ FD రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. మరోపక్క బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు కూడా పెరుగుతుంది.
* రెపో రేటు అంటే ఏంటి? : ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక నిధులపై విధించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. బ్యాంకులు MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ఆధారంగా వివిధ రకాల కస్టమర్లకు వడ్డీ రేట్లను నిర్ణయించాల్సి ఉంటుంది. రెపో రేటు, ఇతర లోన్ రేట్లు పరిగణనలోకి తీసుకుని, బ్యాంకులు నెలవారీ ప్రాతిపదికన MCLRని సవరిస్తాయి.