బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని వేచి చూసే వారికి గుడ్‌న్యూస్. త్వరలో ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposits)పై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన మంథ్లీ బులిటెన్‌లో ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెరగనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) హింట్ ఇచ్చింది.
కస్టమర్ల నుంచి డిపాజిట్ల సేకరణలో బ్యాంకులు పోటీ పడుతున్నట్లు ఆర్బీఐ మంథ్లీ బులిటెన్‌లో వెల్లడించింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. దీంతో అకౌంట్ హోల్డర్ల నుంచి డిపాజిట్లను ఆకర్షించేందుకు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఇలా ఒక బ్యాంకును మించి మరొక బ్యాంకు వడ్డీ రేట్లు పెంచాయి. డిపాజిట్ బేస్‌ని విస్తరించుకోవడానికి బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం వర్కౌట్ అయిందని ఆర్బీఐ తెలిపింది.
* చిన్న బ్యాంకులే ఎక్కువ వడ్డీ రేటు : వరుసగా ఆరు సార్లు ఆర్బీఐ రెపో రేటును పెంచింది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచక తప్పలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించాయి. బ్యాంక్‌బజార్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై టాప్ 10 బ్యాంకులు అమలు చేసిన సగటు వడ్డీరేటు 7.5శాతంగా ఉండటం గమనార్హం.
* టర్మ్ డిపాజిట్లే ఎక్కువ : సేవింగ్స్, కరెంట్ డిపాజిట్లతో పోలిస్తే బ్యాంకులకు టర్మ్ డిపాజిట్ల రూపంలోనే ఎక్కువగా డిపాజిట్లు సమకూరాయని ఆర్బీఐ తెలిపింది. వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఈ టర్మ్ డిపాజిట్లపై వచ్చే రిటర్న్స్ పెరిగాయి. వార్షిక సంవత్సర ప్రాతిపదికన టర్మ్ డిపాజిట్లు 13.2 శాతం వృద్ధిని సాధించాయి. మరోవైపు, కరెంట్, సేవింగ్స్ డిపాజిట్లు మోస్తరుగా పెరిగాయి. కరెంట్ డిపాజిట్లు 4.6శాతం వృద్ధిని సాధించగా, సేవింగ్స్ డిపాజిట్లు 7.3శాతం మేర పెరిగాయి.
* మరోసారి రెపో రేటు పెరుగుదల? : దివాలా నుంచి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. అయినా, రిజర్వ్ బ్యాంక్ మరోసారి రెపో రేటు పెంచే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ నెలలో మరో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును ఆర్బీఐ పెంచనుందని అనుమానిస్తున్నారు. ఫలితంగా రెపో రేటు 6.75శాతానికి చేరుకుంటుంది. దీంతో గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటు 275 బేసిస్ పాయింట్లు పెంచినట్లు అవుతుంది.
* ధరల పెరుగుదలపై ఆందోళన : కరోనా మహమ్మారి అనంతరం భారత్ వేగంగా కోలుకుందని గుర్తు చేసింది. వ్యవసాయ రంగం సహాయంతో ఆర్థిక వ్యవస్థ కుచించకుండా ముమెంటమ్‌ని కొనసాగించగలిగిందని ఆర్బీఐ పేర్కొంది. అయినప్పటికీ, నిరంతర ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం హెచ్చు స్థాయిలో కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు, అమెరికా బ్యాంకులు దివాలా తీయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం ఉండకపోవచ్చని ఆర్బీఐ అభిప్రాయపడింది. కాకపోతే రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చీకట్లు ఏర్పడవచ్చని తెలిపింది.