రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. ఇందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, చాలా మంది ప్రయాణికులు టికెట్ ఇన్స్పెక్టర్ల కళ్లుగప్పి ప్రయాణం చేస్తుంటారు. కానీ ఓ మహిళా అధికారి నుంచి మాత్రం తప్పించుకోలేరు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని, చెల్లని టికెట్‌తో ప్రయాణిస్తున్న వారిని ఆమె కచ్చితంగా పట్టుకుని తీరుతుంది. (PC : Ministry Of Railways)
సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్(Chief Ticket Inspector- CTI)గా మేరీ విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ ప్రయాణికుల రైల్వే టికెట్లను చెక్ చేస్తుంటారు. స్టేషనులో, రైలులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. టికెట్ లేని, చెల్లని టికెట్లతో ప్రయాణించే వారిని గుర్తించి జరిమానా విధిస్తుంటారు. (PC : Ministry Of Railways)
* రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ : మేరీ పనితనానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమె సేవలను కొనియాడింది. డ్యూటీలో కమిట్మెంట్తో పనిచేస్తున్న మేరీని రైల్వే శాఖ ప్రశంసించింది. ‘భారతీయ రైల్వే చరిత్రలో నాన్ టికెటెడ్ ట్రావెలర్స్ నుంచి పెనాల్టీగా రూ.1.03 కోట్లను వసూలు చేసిన తొలి మహిళా అధికారిగా రోసాలిన్ నిలిచింది’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో మేరీ ఫొటోలను యాడ్ చేసింది. రైల్వే స్టేషనులో, రైలులో ప్రయాణికుల టికెట్లను తనిఖీలు చేస్తూ, టికెట్ లేని ప్రయాణికుల నుంచి పెనాల్టీ వసూలు చేస్తున్న దృశ్యాలను మంత్రిత్వ శాఖ పంచుకుంది.(PC : Ministry Of Railways)
* నెటిజన్లు సైతం.. : వృత్తిపై అరోకియా మేరీ చూపిస్తున్న డెడికేషన్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడానికి మేరీలా మరింత మంది మహిళా అధికారుల అవసరం ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాగే పనిచేయాలని ఆశించారు. ‘నీ ఫ్రెండ్‌ని అయినందుకు నాకు గర్వంగా ఉంది రోసాలిన్. నీ డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ గురించి నాకు తెలుసు’ అని మరొక యూజర్ కామెంట్ చేశారు. ఇంకో యూజర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
* సదరన్ రైల్వేలో ముగ్గురు : 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు పెనాల్టీల రూపంలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన అధికారుల జాబితాను సదరన్ రైల్వే విడుదల చేసింది. మేరీతో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ ఘనత సాధించారు. చెన్నై డివిజన్లో డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎస్. నందకుమార్ రూ.1.55 కోట్లు కలెక్ట్ చేశారు. సీనియర్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తున్న శక్తివేల్ రూ.1.10 కోట్లను పెనాల్టీ కింద వసూలు చేశారు. దీంతో వీరిని సదరన్ రైల్వే అభినందించింది.