* ఏప్రిల్ 8న చెన్నైకి వస్తున్న మోదీ : IANS తెలిపిన వివరాల మేరకు.. చెన్నై- కోవై మధ్య వందే భారత్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న చెన్నైకి రానున్నారు. వివిధ రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. త్వరలో చెన్నైలో ఆవిష్కరిస్తున్న వందే భారత్ రైలు ఇండియాలో మొత్తంగా 11వ రైలు అవుతుంది.
దీని కంటే ముందు ఢిల్లీ-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు మొదలైతే చెన్నై-కోవై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ-హై స్పీడ్ 12వ రైలు అవుతుంది. ఢిల్లీ- జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలును ఏప్రిల్ 10లోగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
చెన్నై వందే భారత్‌తోపాటు తాంబరం-సెంగోట్టై ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి పర్యటనను రాష్ట్ర పౌరసంబంధాల శాఖ ప్రకటించింది, అయితే ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేవు. ఇప్పుడు రాబోతున్న వందే భారత్ చెన్నై నుంచి మొదలవుతున్న రెండో రైలు. ప్రధాని మోదీ గతంలో తన మైసూర్ పర్యటన సందర్భంగా చెన్నై సెంట్రల్-మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
ఢిల్లీ-జైపూర్-అజ్మీర్ మార్గంలో మరో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ- జైపూర్ మధ్య 250 కి.మీ దూరాన్ని కేవలం 3 గంటలలోపు చేరుకోనుంది. ఈ మార్గంలో ప్రయాణికులకు చాలా ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. వందే భారత్ రైలు ఈ మార్గంలో నడపడానికి ముందు కొన్ని సాంకేతిక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి తెలిపారు.
* వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాలు : న్యూఢిల్లీ నుంచి వారణాసికి అదే విధంగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. అదే విధంగా గాంధీ నగర్ రాజధాని- ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అంబ్ అందౌరా- న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ -మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, బిలాస్పూర్- నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, న్యూ జల్పైగురి - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి.