ఇంధన ధరలు రోజురోజుకు సామన్యుడికి భారంగా మారుతున్నాయి. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం స్థిరంగానే ఉండటంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లి ఆదివారం మరో 36 పైసలు పెట్రోల్ ధర పెరిగింది. ఇలానే నిత్యం పెరిగితే త్వరలో రూ.120 చేరువయ్యే అవకాశం ఉందని జనం భయపడుతున్నారు.
ఇక.. రాజస్థాన్లోని సరిహద్దు పట్టణమైన గంగానగర్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలోకెల్లా ఈ ప్రాంతంలోనే ఇంధన ధరలు భగ్గుమంటున్నట్టు తెలిసింది. జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.90గా ఉంది. లీటర్ పెట్రోల్ 120 రూపాయలకు చేరువ అవుతుండటంతో అక్కడి వాహనదారులు అల్లాడిపోతున్నారు. డీజిల్ కూడా ‘నేనేమన్నా తక్కువ తిన్నానా’ అన్నట్టుగా లీటర్ కూడా పరుగులు పెడుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది. పెట్రోల్ కంటే విమాన ఇంధన ధర తక్కువగా ఉందని, విమాన ఇంధన ధర లీటర్ 79 రూపాయలు పలుకుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలు దాటి పైపైకి ఎగబాకుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండడం..అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉండడంతో ఇప్పట్లో ఇంధన ధరలు తగ్గేలా కనపడట్లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.