న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో బుధవారం కూడా ఎలాంటి మార్పు లేకపోవడం వాహనదారులకు కొంత ఊరట కలిగించే విషయం. వరుసగా ఆరవ రోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు లేకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారి గమనిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించుకున్న తర్వాత కూడా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.91.43గా ఉంది. కోల్‌కత్తాలో లీటర్ డీజిల్ ధర 100కు పైగానే ఉంది. కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉండగా, లీటర్ డీజిల్ ధర 101.56గా ఉంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.23గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.87గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.85.01గా ఉంది. తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.36గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.93.47గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున వినిపించింది. పెట్రోల్ కంటే విమాన ఇంధన ధర తక్కువగా ఉందని, విమాన ఇంధన ధర లీటర్ 79 రూపాయలు పలుకుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలు దాటి పైపైకి ఎగబాకుతున్నాయని నెటిజన్లు మండిపడ్డారు. ప్రతిపక్షాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. ఈ తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయలు తగ్గింది. తగ్గించిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి వాహనదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అందువల్ల.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టడం వాహనదారులకు శుభ పరిణామం.