1. కొత్త నెల వస్తే కొత్త రూల్స్ కూడా వస్తుంది. ఈసారి కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 1న 2022-23 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఆర్థిక అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు మరిన్ని రూల్స్ కూడా అమల్లోకి వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్, వాహనాల రీరిజిస్ట్రేషన్, పాన్ కార్డ్... ఇలా అనేక అంశాలకు సంబంధించి కొత్త నియమనిబంధనలు అమల్లోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. Vehicle Reregistration: 15 ఏళ్లు దాటిన పాతవాహనాలన్నింటినీ మళ్లీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దీన్నే వెహికిల్ రీరిజిస్ట్రేషన్ అంటారు. వాహనాల రీరిజిస్ట్రేషన్ ఛార్జీలు 2022 ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్నాయి. ఢిల్లీ తప్ప దేశమంతా పాత వాహనాల రీరిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పాత వాహనాలను రీరిజిస్ట్రేషన్ చేయాలంటే ఎనిమిది రెట్లు అదనంగా ఛార్జీలు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి టూవీలర్‌కు రూ.1,000, కారుకు రూ.5,000, ట్యాక్సీలకు రూ.7,000 బస్సులకు రూ.12,500 చొప్పున చెల్లించాలి. రీరిజిస్ట్రేషన్ ఆలస్యం చేస్తే నెలకు రూ.3,000 చొప్పున అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు నెలకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. PF Account: పీఎఫ్ అకౌంట్లో ఎక్కువగా డబ్బులు జమ చేసేవారికి కొత్త ట్యాక్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈపీఎఫ్ అకౌంట్లో రూ.2,50,000 కన్నా ఎక్కువ జమ చేస్తే పన్నులు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5,00,000 వరకు జమ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం రూల్స్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ అకౌంట్ ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ సెక్షన్స్‌గా విడిపోనుంది. నాన్ ట్యాక్సబుల్ సెక్షన్లో రూ.2,50,000 వరకు జమ చేయొచ్చు. అంతకుమించి జమ చేస్తే ట్యాక్సబుల్ సెక్షన్లోకి వెళ్తుంది. ఆ మొత్తానికి పన్ను చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. PAN Card: పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అనేక సార్లు కోరింది. చివరి సారిగా 2022 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అప్పట్లోగా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మొదటి మూడు నెలలు రూ.500, ఆ తర్వాత 9 నెలలు రూ.1,000 చొప్పున జరిమానా చెల్లించాలి. 2023 మార్చి 31 లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదు. ఆ పాన్ కార్డ్ ఇనాక్టీవ్‌గా మారుతుంది. ఇక ఆ పాన్ కార్డును లావాదేవీల్లో ఉపయోగించడానికి వీల్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. SBI: ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా బ్యాకింగ్ సేవలు పొందాలనుకుంటే కస్టమర్లు తప్పనిసరిగా తమ పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కోరుతోంది. బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కస్టమర్లు తప్పనిసరిగా రెండు డాక్యుమెంట్స్ లింక్ చేయాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ అకౌంట్ ఉన్నవారికి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ స్కీమ్‌ల ద్వారా ప్రతీ నెల, మూడు నెలలకు, ఏడాదికి ఓసారి వచ్చే వడ్డీని నగదు రూపంలో ఇకపై పొందడానికి అవకాశం ఉండదు. 2022 ఏప్రిల్ 1 నుంచి వడ్డీని ఖాతాదారుల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏప్రిల్ 4 నుంచి పాజిటీవ్ పే సిస్టమ్ అమలు చేయనుంది. రూ.10 లక్షల కన్నా ఎక్కువ చెక్స్ క్లియర్ చేసేందుకు ఈ పద్ధతి పాటించనుంది. కస్టమర్ ఎవరికైనా రూ.10 లక్షల కన్నా ఎక్కువ విలువ ఉన్న చెక్ ఇస్తే ఆ చెక్ క్లియర్ చేయడానికి బ్యాంకు సదరు కస్టమర్ నుంచి రీకన్ఫర్మేషన్ అడుగుతుంది. దీని వల్ల చెక్ మోసాలు తగ్గనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)