కొంతకాలంగా పెద్దనోట్ల చలామణి, వివిధ కాయిన్ల రద్దుపై అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. కొంత మంది ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏటీఎంల్లో రూ.2వేల నోట్లను ఉంచొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్(ATM)లలో రూ.2 వేల నోట్లు అందుబాటులో ఉంచాలా? లేదా? అనే అంశంపై ఇండియన్ బ్యాంకులకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది.
క్యాష్ వెండింగ్ మెషీన్లలో కరెన్సీ లోడ్ చేయడం బ్యాంక్‌ల సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సోమవారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాలలో గతంలో ఎక్కువగా డ్రా చేసిన నోట్లు, అక్కడి వినియోగదారుల అవసరాల మేరకు ఏ నోట్లు భర్తీ చేయాలనే అంశంపై సంబంధిత బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
* సురక్షితంగా రిస్క్ ప్రొఫైల్ : 2023 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ డెట్/లయబిలిటీస్ మొత్తం సుమారు రూ.155.8 లక్షల కోట్లుగా (జీడీపీలో 57.3 శాతం) అంచనా వేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో ప్రస్తుత ఎక్స్ఛేంజ్ రేటు ప్రకారం ఎక్స్టర్నల్ డెట్ విలువ రూ.7.03 లక్షల కోట్లు(జీడీపీలో 2.6 శాతం)గా ఉంటుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మొత్తం డెట్/లయబిలిటీస్‌లో ఎక్స్టర్నల్ డెట్ వాటా కేవలం 4.5 శాతం మాత్రమే, ఇది GDPలో 3 శాతం కంటే తక్కువ. ఎక్స్టర్నల్ డెట్‌కి దాదాపు ఎక్కువగా రాయితీ రేట్ల వద్ద మల్టిలేటరల్, బైలేటరల్ ఏజెన్సీలు నిధులు సమకూరుస్తాయి. అందువల్ల రిస్క్ ప్రొఫైల్ సురక్షితంగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
* ఆర్బీఐ కీలక చర్యలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, ఎక్స్ఛేంజ్ రేటు అస్థిరత, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం తగ్గించడానికి ఫారెక్స్ ఫండింగ్ సోర్సెస్‌ను విస్తరించడానికి ఇటీవల కొన్ని చర్యలను ప్రకటించింది. అందులో.. వడ్డీ రేట్లపై ఉన్న నియంత్రణ నుంచి తాజా FCNR(B), NRE డిపాజిట్లు మినహాయించారు.
అంటే ఈ వడ్డీ రేట్లు 2022 అక్టోబర్ 31 వరకు దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్లపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉండవు. ఆటోమేటిక్ రూట్లో ఎక్స్టర్నలన్ కమర్షియల్ బారోయింగ్ లిమిట్‌ను USD 1.5 బిలియన్లకు పెంచారు. 2022 డిసెంబర్ 31 వరకు సెలక్టెడ్ కేసెస్‌లో ఆల్-ఇన్-కాస్ట్ సీలింగ్ 100 బేసిస్ పాయింట్లు పెంచడం వంటివి ఉన్నాయి.