ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, ఆస్తులను పెంచుకోవడానికి ఇంకా అప్పులు కాకుండా ఉండేందుకు పొదుపు చాలా అవసరం. మీరు సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేసినప్పుడు మాత్రమే పొదుపు చేయడం సాధ్యమవుతుంది. మనలో చాలా మంది పొదుపు చేస్తారు. కానీ కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా మన పొదుపు దెబ్బతింటుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. అయితే ఈ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే పొదుపు అనేది సాఫీగా సాగుతుంది.
మొదట ఖర్చు చేయవద్దు: ఎప్పుడైనా ఖర్చు చేసిన తర్వాత మిగిలి ఉన్న దానినే పొదుపు చేయవద్దు. అయితే, ఆదా చేసిన తర్వాత మిగిలి ఉన్నదాన్ని మాత్రమే ఖర్చు చేయండి. కాబట్టి ముందుగా మీ సంపాదన నుంచి పొదుపు చేయాలని నిర్ణయించిన మొత్తాన్ని పక్కకు పెట్టండి. మిగిలిన డబ్బును మాత్రమే పొదుపు చేయండి. అదే పొదుపుకు డబ్బులు పక్కన పెట్టకుండా ఖర్చు చేయడం ప్రారంభిస్తే.. మీకు ఏమీ మిగలకపోవచ్చు. అందువల్ల, మీరు మొదట సంపాదనలో కొంత భాగాన్ని పొదుపుకు కేటాయించడం ముఖ్యం. ఇందుకోసం ముందుగా ప్లానింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం.
జాబితా తయారు చేయకుండా షాపింగ్ చేయవద్దు: మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా, జాబితాను ముందుగా రూపొందించుకోండి. ఇలా చేయడం వల్ల అవసరమైన వస్తువులను మర్చిపోకుండా కొనుగోలు చేస్తారు. అనవసరమైన వస్తువుల కొనుగోలు చేయకుండా ఉంటారు. షాపింగ్ జాబితాను తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం మనకు అవసరమైన వాటితోనే జాబితాను రూపొందించి కొనుగోలు చేయండి. ఇంకా షాపింగ్ కు వెళ్లే సమయంలో నే బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ లోపే షపింగ్ ముగిసేలా ప్లాన్ చేసుకోండి.
ఆదాయాన్ని పెంచుకోకుండా, ఖర్చును పెంచుకోవద్దు: సాధారణంగా కాలక్రమేణా ప్రజలు తమ ఆదాయంలో పెరుగుదల లేకపోయినా, ఖర్చును మాత్రం తప్పనిసరిగా పెంచుకుంటూ పోతారు. ఇది మన పొదుపును ఎక్కువగా ప్రభావితం చేసే అతి పెద్ద అంశం. కాబట్టి, ఆదాయం పెరిగే వరకు మీ ఖర్చులను పెంచుకోకండి. ఇలా చేయడం వల్ల మీ పొదుపుపై ప్రభావం పడదు. భవిష్యత్ లో ఇబ్బందులు ఉండవు.
బడ్జెట్‌ను రూపొందించడం ఎప్పటికీ మర్చిపోవద్దు: మీరు మీ ఇంటికి బడ్జెట్‌ను తప్పనిసరిగా రూపొందించాలి. మొత్తం ఆదాయం మరియు ఖర్చుల జాబితా మెయింటేన్ చేయాలి. బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు జాగ్రత్త వహించాలి మరియు మీ ఖర్చులను బాగా గుర్తించాలి. అలాగే, బడ్జెట్‌ను రూపొందిస్తే అనవసర ఖర్చులను నివారించవచ్చు. బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు, మీరు రాబోయే కాలానికి ఎంత ఆదా చేసుకోవాలో కూడా పరిగణలోకి తీసుకోవాలి.