ఏటా చాలా మంది పన్ను చెల్లింపుదారులు నిర్ణీత గడువులోగా ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయలేరు. వారికి ఆదాయపన్ను శాఖ మరికొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వాస్తవానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139 (1) ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2021-22 (అసెస్మెంట్ ఇయర్ 2022-23)కి సంబంధించి 2022 జులై 31లోపు ITR ఫైల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
గడువు తేదీని మిస్ అయిన వారు డిసెంబర్ 31లోపు లేట్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. అదే విధంగా ఫైల్ చేసిన ఐటీఆర్‌లో ఏవైనా లోపాలు గుర్తిస్తే.. డిసెంబర్ 31లోపు రివైజ్డ్ రిటర్న్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. రివైజ్డ్ రిటన్న్ ఫైల్ చేయడంలో కూడా విఫలమైన వారు.. ITR-U(అప్డేటెడ్ రిటర్న్) ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ITR-U ఎలా దాఖలు చేయాలి? ఎలా పనిచేస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ITR-U అంటే ఏంటి?
భారత ప్రభుత్వం 2022 బడ్జెట్లో ITR-U ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయం ITRని దాఖలు చేయని లేదా మునుపటి రిటర్న్‌లలో తప్పులు చేసిన పన్ను చెల్లింపుదారులందరికీ సహాయపడుతుంది. ITR-U ద్వారా.. పన్ను చెల్లింపుదారులు సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ముగిసిన రెండు సంవత్సరాల వరకు తమ ITRలలో లోపాలు సరిచేయవచ్చు. అసెస్మెంట్ ఇయర్ 2021-22 కోసం, ITR-Uని 2024 మార్చి 31లోపు ఫైల్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
మునుపటి రిటర్న్‌లో నివేదించడంలో విఫలమైన ఏదైనా ఆదాయాన్ని నివేదించడానికి ITR-Uని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఈ సదుపాయం ఒరిజినల్, బిలేటెడ్, రివైజ్డ్ ITRని ఫైల్ చేసిన లేదా చేయని ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా ఐటీఆర్‌ను ఫైల్ చేయలేకపోయినప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
* ITR-U ఫైల్ చేసినందుకు జరిమానా
ITR-U ఫైలింగ్‌కు కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని నివేదించడంలో పొరపాటు జరిగితే.. రిపోర్ట్ చేయని ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను, వడ్డీలో 25 శాతాన్ని అదనపు పన్నుగా చెల్లించాలి. ఇది సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ముగిసిన సంవత్సరంలోపు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 1 సంవత్సరం తర్వాత సంబంధిత అసెస్మెంట్ ఇయర్ నుంచి 2 సంవత్సరాలలోపు ITR-Uని ఫైల్ చేస్తే.. పెనాల్టీ రేటు 50 శాతం వరకు పెరుగుతుంది.
ITR-Uని ఎప్పుడు ఉపయోగించలేరు?
పన్ను చెల్లింపుదారులు నిల్ రిటర్న్/లాస్ రిటర్న్ ఫైల్ చేయడానికి ITR-Uని ఉపయోగించలేరు. ఇది రీఫండ్ క్లెయిమ్ చేయడానికి లేదా ఎన్‌హ్యాన్సింగ్ చేయడానికి ఉపయోగపడదు. అలాగే ఇంతకుముందు దాఖలు చేసిన రిటర్న్ నుంచి ఇన్‌కం ట్యాక్స్ లయబిలిటీని తగ్గించడానికి ITR-Uని ఉపయోగించే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)