మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీలైనంత త్వరగా మీకు నచ్చిన బ్రాండ్ వెహికల్‌ను కొనడం మంచింది. ఎందుకంటే వచ్చే నెల నుంచి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, హోండా వంటి ప్రధాన కంపెనీలు BS-VI ఫేజ్-2 ఎమిషన్ నార్మ్స్ అమలు చేయనున్న నేపథ్యంలో 2023, ఏప్రిల్ 1 నుంచి ఈ సంస్థల వాహనాల ధరలు పెరగనున్నాయి.
ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రస్తుతం తమ ప్రొడక్ట్స్‌ను భారత్ స్టేజ్ VI (BSVI), ఫేజ్-2కు అనుగుణంగా మార్చడానికి కృషి చేస్తోంది. 2023, ఏప్రిల్ 1 నుంచి ఈ ఎమిషన్ నార్మ్స్ ప్రకారం.. రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ లెవల్స్ పర్యవేక్షించడానికి వాహనాలకు ఆన్ బోర్డ్ సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్ అవసరం. BS6 ఫేజ్-2 ట్రాన్సిషన్ కోసం కంపెనీలు అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఈ మేరకు కస్టమర్లపై భారం పడనుంది. ఏయే కంపెనీలు ఎంత మొత్తంలో ధరలను పెంచనున్నాయో తెలుసుకుందాం.
* హీరో మోటోకార్ప్ : ఇండియన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్, తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి దాదాపు 2% పెంచనున్నట్లు ప్రకటించింది. ఉద్గార నిబంధనల ప్రకారం.. వాహనాల్లో ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ (OBD 2) ఏర్పాటు చేయడానికి ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. మోడల్, మార్కెట్‌ను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. అయితే ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి ఈ సంస్థ వివిధ ఫైనాన్సింగ్ సొల్యూషన్ అందిస్తుంది.
* మారుతి సుజుకి : ఏప్రిల్‌లో వివిధ మోడళ్లపై ధరలను పెంచనున్నట్లు మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం, రెగ్యులేటరీ అవసరాలు, పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ధరలు ఎంత మేరకు పెంచుతున్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఖర్చుల ఒత్తిడిని తట్టుకోవడానికి, ఆ ప్రభావాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పట్లేదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ధరల పెరుగుదల మోడల్‌ను బట్టి మారుతూ ఉంటుంది.
* హోండా కార్స్ ఇండియా : హోండా కంపెనీ ఈసారి పెద్ద మొత్తంలో కార్ల ధరలను పెంచుతోంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్, అమేజ్ ధరలను రూ.12,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. కఠినమైన ఉద్గార నిబంధనల ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని, ఫలితంగా దీన్ని భర్తీ చేయడానికి ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్ ఇండియా పేర్కొంది. అయితే కంపెనీ మిడ్ సైజ్ సెడాన్, హెండా సిటీ ధరలు మాత్రం మారవు.
* టాటా మోటార్స్ : BS-VI ఫేజ్- II ఉద్గార నిబంధనలను అమలు చేస్తున్న నేపథ్యంలో, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను 5% వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ధరల పెరుగుదల మొత్తం కమర్షియల్ వెహికల్స్ రేంజ్‌కు వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ మొత్తం మారుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.