* ఆ కంపెనీల బాటలోనే.. : ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడం, డిమాండ్ తగ్గడం, ఇతర అంశాల నేపథ్యంలో ఇప్పటికే అమెజాన్, మెటా ప్లాట్‌ఫామ్స్ ఐఎన్‌సీ సహా చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నట్ల ప్రకటించాయి. అమెజాన్ కూడా ఆర్థిక అస్థిరతను కారణంగా చూపిస్తూ ఇటీవల దాదాపు 18వేల మందిని తొలగిస్తున్ట్లు ప్రకటించింది. ఈ విషయంలోనే ఐటీ సెక్టార్ షాక్‌లో ఉందంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మరింత షాక్ ఇచ్చేలా ఉంది.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు రావడంతో టెక్ సెక్టార్లో ఉద్యోగుల తొలగింపు ఇంకా కొంతకాలం కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఐటీ సెక్టార్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు నష్టాల్లోకి వెళ్తే కరోనా సమయంలో నియమించిన ఉద్యోగులకు మొదట ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
మైక్రోసాఫ్ట్‌లో మరో విడత లేఆఫ్స్ ఉండడం చూస్తుంటే పరిస్థితి మెరుగుపడుతున్నట్లు లేదని, మరింత దిగజారుతున్నట్లు తెలుస్తోందని మార్నింగ్ స్టార్ ఎనలిస్ట్ డాన్ రోమానాఫ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో 5శాతం ఉద్యోగులు లేదా 11000 మందిని తొలగించనున్నట్లు తెలుస్తోందని యూకేకు చెందిన స్కైన్యూస్ రిపోర్ట్ చేసింది.
ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల కోతకు సిద్ధమైందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇవి గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ అని తెలిపింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ రిక్రూటింగ్ స్టాఫ్‌ను మూడింట ఒక వంతు మందిని తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఇన్సైడర్ వెల్లడించింది. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.
మైక్రోసాఫ్ట్ కంపెనీలో గత ఏడాది జూన్ 30 నాటికి 2,21,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1,22,000 మంది అమెరికాలో పనిచేసేవారు. 99,000 మంది అంతర్జాతీయంగా పనిచేస్తున్న ఉద్యోగులు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ యూనిట్ అజ్యూర్ వృద్ధి రేటును కొనసాగించే విషయంలో ఒత్తిడిలో ఉంది. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ విషయంలో కొన్ని త్రైమాసికాలలో అంచనాలు అందుకోలేకపోయింది.