1. భారతీయ రైల్వే పర్యాటకుల్ని ఆకట్టుకోవడం కోసం అద్దాల బోగీలతో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లను (Vistadome Coach) ఏర్పాటు చేస్తోంది. విస్టాడోమ్ రైళ్లు పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం సంస్థ ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) విస్టాడోమ్ రైళ్లలో టూరిస్ట్ ప్యాకేజీలను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అందులో భాగంగా కటీల్-ధర్మస్థల-కుక్కి విస్టాడోమ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుంది. యశ్వంత్‌పూర్‌లో బయల్దేరే అద్దాల రైలు పశ్చిమ కనుమల మీదుగా వెళ్తుంది. పర్యాటకులు పచ్చదనం, ప్రకృతి అందాలు, సహజ సౌందర్యాన్ని చూసి ఆనందించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ జర్నీలో సక్లేష్పూర్-సుబ్రమణ్య ఘాట్ సెక్షన్లో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి. ఐఆర్సీటీసీ టూరిజం విస్టాడోమ్ టూర్ యశ్వంత్‌పూర్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్లో విస్టాడోమ్ కోచ్ ఎక్కాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొదటి రోజు మధ్యాహ్నం వరకు రైలు ప్రయాణం ఉంటుంది. మధ్యాహ్నం 3.40 గంటలకు బంటావాలా స్టేషన్లో దిగాలి. అక్కడ్నుంచి క్యాబ్‌లో సోమేశ్వర బీచ్ తీసుకెళ్తారు. బీచ్ సందర్శించిన తర్వాత రాత్రికి మంగళూరులో బస చేయాలి. రెండో రోజు ఉదయం కటీల్ దేవీ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ధర్మస్థలకు బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ధర్మస్థలలో శ్రీ మంజునాథ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కుక్కి బయల్దేరాలి. కుక్కిలో సుబ్రమణ్య స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 7.30 గంటలకు సుబ్రమణ్య రోడ్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అక్కడ రాత్రి 8.40 గంటలకు బెంగళూరు ట్రైన్ ఎక్కితే ఉదయం 6.15 గంటలకు బెంగళూరు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ టూరిజం విస్టాడోమ్ టూర్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ ధర రూ.14,550, ట్విన్ షేరింగ్ ధర రూ.9,240, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.5,640. ఈ టూర్ ప్యాకేజీలో యశ్వంత్‌పూర్ నుంచి బంటావాలా వరకు విస్టాడోమ్ రైలులో ప్రయాణం, సుబ్రమణ్య రోడ్ నుంచి బెంగళూరుకు థర్డ్ ఏసీ ప్రయాణం, ఒక రాత్రి మంగళూరులో బస, బ్రేక్‌ఫాస్ట్, క్యాబ్‌లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ఇప్పటికే ఐఆర్సీటీసీ టూరిజం హిమాలయాల అందాలు వీక్షించాలనుకునేవారి కోసం మరో విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో ఝలోంగ్ బిందు, మూర్తీ రివర్, చప్రమరి వైల్డ్ ఫారెస్ట్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)