వాహనాల ఇన్సూరెన్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ 2021-2022 సంవత్సరానికి థర్డ్ పార్టీ మోటర్ వేకిల్ ఇన్స్యూరెన్స్ రేట్లను పెంచే ఆలోచనలో ఉంది. సాధారణంగా కొత్తగా కొనుగోలు చేసే ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ చేయిస్తారు. గడువు ముగిసిన తర్వాత దాన్ని రెన్యువల్ చేయడంలో చాలామంది అలసత్వం చూపిస్తారు. రోడ్లపై తిరిగే ప్రతి మోటార్ వాహనానికీ ఇన్సూరెన్స్ ఉండాలని కొత్త మోటార్ వేకిల్ చట్టం చెబుతోంది. దీంతో వాహనదారులు పూర్తి ఇన్స్యూరెన్స్ కాకపోయినా థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ను ఎంచుకుంటున్నారు. నిజానికి ఎక్కువ మంది ఇలాంటి బీమానే ఎంచుకుంటున్నారని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు వీరందరిపై పెరిగిన ఇన్సూరెన్స్ రేట్లు ప్రభావం చూపించనున్నాయి.
ఈ ప్రీమియం ధరలను ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సంవత్సరానికి ఒకసారి ప్రకటిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే 2021-2022కి సంబంధించిన ధరలను ఐఆర్డిఏఐ పెంచనుంది. సెగ్మంట్ స్థిరంగా ఉండటం కోసం ప్రీమియంను సవరించాలని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు IRDAIని కోరుతున్నాయి. దీనికి తోడు గత క్లెయిమ్‌లపై కోర్టు తీర్పులు కూడా ఈ సెక్టర్పై ప్రభావం చూపుతున్నాయి. వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను పెంచేటప్పుడు కంపెనీలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్‌లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్‌గా ఉన్న సుబ్రమణ్యం బ్రహ్మజోస్య చెప్పారు. ప్రీమియం ధరలను సవరించేటప్పుడు కంపెనీలు వినియోగదారుల మధ్య సమతూకం ఉండాలన్నారు.
జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి గతేడాది ప్రీమియం రేట్లు పెరగలేదు. 2020 ఫిబ్రవరిలో రేట్లు పెంచడానికి ఆమోదం లభించింది. అయితే అప్పటికే కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. ఫలితంగా రేట్ల పెరుగుదల అమల్లోకి రాలేదు. దీంతో ఈ సంవత్సరం రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. అయితే ప్రీమియం ధరలు ఎంత వరకు పెరుగుతాయనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. కోవిడ్-19 మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ కారణంగా గత ఏడాది వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తగ్గాయి. ఇప్పుడిప్పుడే ఇవి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఇన్స్యూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం 2020-21 సంవత్సరంలో 4.4 శాతం పెరిగి రూ.10,650 కోట్లకు చేరింది. 2019-20లో నమోదైన రూ.10,198 కోట్లతో పోలిస్తే కాస్త పెరుగుదల కనిపించింది.