2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారమ్‌లో కొత్త కాలమ్ చేరనుంది. క్రిప్టోకరెన్సీ ఆదాయానికి సంబంధించి ప్రత్యేక కాలమ్‌ను చేర్చనున్నట్లు రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ వెల్లడించారు. క్రిప్టో, ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలని బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
దీనికి అనుగుణంగానే ఐటీఆర్ ఫారమ్‌లో ప్రత్యేక కాలమ్‌ను చేర్చనుంది ఆదాయపు పన్ను శాఖ. బడ్జెట్ 2022–23 ప్రకారం, డిజిటల్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయంపై 30% సెస్, సర్‌ఛార్జీల రూపంలో పన్ను చెల్లించాలి. ప్రస్తుతం, గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్లపై పన్ను వసూలు చేస్తున్న విధంగానే క్రిప్టోకరెన్సీ లాభాల నుంచి కూడా పన్ను వసూలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
క్రిప్టో ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన 5 పాయింట్లు ఇవే..
క్రిప్టోకరెన్సీపై పన్ను కొత్తదేమీ కాదు
తరుణ్ బజాజ్ మాట్లాడుతూ ‘‘వర్చువల్ లావాదేవీల నుండి వచ్చే ఆదాయంపై ఎల్లప్పుడూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, క్రిప్టో కరెన్సీ నుంచి వచ్చే ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలి. ఇది కొత్త నిబంధనేమీ కాదు. కాకపోతే, 2022 బడ్జెట్ బిల్లు దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ బిల్లు వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధించడానికి మార్గం సుగమం చేసింది. అందుకే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు క్రిప్టోల నుండి వచ్చే ఆదాయాన్ని కూడా తెలియజేయాలి.”అని పేర్కొన్నారు.
భారతదేశంలో క్రిప్టోకరెన్సీ ఇంకా చట్టబద్ధం కాలేదు
భారత ప్రభుత్వం క్రిప్టో, ఇతర వర్చువల్ కరెన్సీల నుండి వచ్చే ఆదాయంపై 30% పన్ను ప్రకటించింది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టతనిస్తూ, క్రిప్టోలను ప్రభుత్వం చట్టబద్దం చేసినట్లు పెట్టుబడిదారులు భావించకూడదని పేర్కొన్నారు. అందువల్ల, క్రిప్టో, NFT వంటి ఇతర వర్చువల్ కరెన్సీల చట్టబద్ధతపై రాబోయే బిల్లులో స్పష్టత రానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
క్రిప్టోకరెన్సీ ట్రాన్స్ఫర్లు/పేమెంట్లపై టీడీఎస్
ఒక సంవత్సరంలో రూ. 10,000 కంటే ఎక్కువ క్రిప్టో ట్రాన్స్ఫర్లు/ పేమెంట్లు జరిపితే 1% టీడీఎస్ చెల్లించాలని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 50,000 వరకు టీడీఎస్ వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఈ టీడీఎస్ నిబంధన జూలై 1, 2022 నుండి అమల్లోకి రానుంది. అయితే, క్రిప్టో లాభాలపై ఏప్రిల్ 1 నుండి పన్ను విధింపు వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
క్రిప్టో, వీడీఏ గిఫ్ట్‌లపై కూడా పన్ను
బడ్జెట్ 2022 ప్రకారం, మీరు క్రిప్టోలను గిఫ్ట్ కింద స్వీకరించినప్పటికీ దానిపై వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. క్రిప్టోకరెన్సీల నుండి రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తే 30% పన్నుతో పాటు అదనంగా 15% సర్ఛార్జ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)