Gladiolus Flower Farming : పూల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని చాలాసార్లు రుజువైంది. ఐతే.. అన్ని రకాల పూలూ లాభాలు ఇవ్వవు. సరైన రకాల పువ్వులను మాత్రమే ఎంచుకోవాలి. పూల మాలలు, పూజా మందిరాలు, కల్యాణ పుష్పాలు, పుష్పగుచ్ఛాలు ఇలా ఎన్నో అవసరాల కోసం పువ్వులకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం పుష్పగుచ్ఛాలను (బొకేలను) తయారు చేయడానికి ఉపయోగించే వివిధ రకాల పువ్వుల గురించి సమాచారం తెలుసుకుందాం. గ్లాడియోలస్ పూల సాగు గురించి చెప్పుకుందాం.
గ్లాడియోలస్ పువ్వు పొడవు 50-100 సెం.మీ. ఉంటుంది. పువ్వు జీవిత కాలం 8-10 రోజులు. దీని విత్తనాలను సమశీతోష్ణ వాతావరణంలో అంటే ఆగస్టు-అక్టోబర్ మధ్య నాటుతారు. ఈ మొక్కల మధ్య దూరం 20×30 సెం.మీ. ఉండాలి. ఈ మొక్కల కోసం ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. గ్లాడియోలస్ మొక్కలు కాంతి ద్వారా ప్రభావితం కావు. ఎండ కొంత ఎక్కువగా ఉన్నా పర్వాలేదు.
ఈ దుంపలు నాటిన 3 లేదా 4 నెలలకు మొక్కలు పెరుగుతాయి. వీటి నుంచి హెక్టారుకు 2 నుంచి 3 లక్షల పూలు వస్తాయి. అలాగే 18వేల కేజీల నుంచి 20 వేల కేజీల దాకా దుంపలొస్తాయి. వీటిని ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో అమ్ముకోవచ్చు. లేదా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సప్లై చేయవచ్చు. ఈ పూలు త్వరగా వాడిపోవు కాబట్టి.. మంచి లాభాలు సాధించేందుకు వీలవుతుంది.