కరోనా తరువాత భూముల రేట్లకు రెక్కలు రావడం, సొంతిళ్లు కొనలేని పరిస్థితి ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ప్లాట్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. మహమ్మారి కారణంగా ఈ ధోరణి మరింతగా పెరిగింది. డబ్బు అత్యవసరమైనప్పుడు తీసుకున్న ప్లాట్‌ను అమ్ముకోవడం లేదా డబ్బు ఉన్నప్పుడు అక్కడే ఇళ్లు కట్టుకోవచ్చే ఉద్దేశంలో ఎక్కువ మంది ఈ వైపు ఆలోచిస్తున్నారు. అయితే చాలామందికి తెలియని అంశం ఏంటంటే.. బ్యాంకులు కేవలం గృహ రుణాలే కాదు ప్లాట్ల కొనుగోలుకు కూడా రుణాలిస్తాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఎక్కువ వడ్డీకి బయట అప్పులు తెచ్చి ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే హౌంజింగ్ లోన్లతో పోలిస్తే వీటికి కాస్త వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ రెంటింటి మధ్య వ్యత్యాసం, వడ్డీ రేట్లను తెలుసుకుందాం.
ప్లాట్ల కోసం రుణం తీసుకోవచ్చా: తీసుకోవచ్చు. సాధారణంగా భవిష్యత్తులో ఇళ్లు కట్టుకోవడానికి ప్లాట్ కొనుగోలు చేస్తుంటాం. వీటి కోసం కూడా బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. ఈ లోన్లపై బ్యాంక్ బజార్ సిఈఓ అధిల్ శెట్టి మాట్లాడుతూ “ప్లాట్‌తో పాటు అక్కడ ఇళ్లు కట్టుకోవడానికి అయ్యే ఖర్చును అంచనా వేసి బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. అయితే, ఈ లోన్లు వ్యవసాయ భూములకు వర్తించవు. ఎంతమేర లోన్ మంజూరు చేసే విషయం మాత్రం ఆ ఏరియాలో ఉన్న ప్లాట్ వాల్యూని బట్టి నిర్ణయిస్తాయి.” అని పేర్కొన్నారు.
వడ్డీ, కాల వ్యవధి: చాలా బ్యాంకులు లేదా ఇతర రుణదాతలు ప్లాట్ లోన్లను రిస్కీ లోన్లుగా భావిస్తాయని ఆండ్రోమెడ & అప్నాపైసా సిఈఓ వి స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల, హౌజింగ్ లోన్లతో పోలిస్తే ప్లాట్ లోన్లు వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అలాగే, హౌజింగ్ లోన్లతో పోలిస్తే, ప్లాట్ లోన్లు చాలా తక్కువ కాల వ్యవధితో వస్తాయి. గరిష్టంగా వీటికి 15 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి కల్పించవు. అదే హౌజింగ్ లోన్ల విషయానికి వస్తే, ఈ వ్యవధి 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్లాట్ లోన్లను గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధితో మంజూరు చేస్తాయి.
లోన్- టు -వాల్యూ రేషియో: బ్యాంకు లేదా ఏదైనా రుణదాత మీ ప్లాట్‌కు ఎంత మొత్తంలో రుణం మంజూరు చేయాలనే దాన్ని నిర్ణయించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశాన్ని లోన్ -టు వాల్యూ రేషియో అంటారు. హౌజింగ్ లోన్ విషయంలో కొన్ని బ్యాంకులు మీ ఆస్తి విలువలో 90 శాతం వరకు రుణంగా అందజేస్తాయి. అదే, ప్లాట్ లోన్ల విషయంలో మాత్రం ఇది సాధారణంగా 80 శాతానికి మించదు. ప్లాట్ విలువ పెరిగేకొద్దీ, ఎల్టివి నిష్పత్తి తగ్గుతుంది.
ప్లాట్‌లో ఇల్లు కట్టుకోకపోతే : మీరు ప్లాట్ లోన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని కీలక అంశాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆ ప్లాటులో మీరు ఎప్పుడు నిర్మాణం ప్రారంభిస్తారనే విషయం తెలపాల్సి ఉంటుంది. దీనిపై అధిల్ శెట్టి మాట్లాడుతూ "నివాస అవసరాల కోసం కొంత భూమిని కొనుగోలు చేయడానికి ప్లాట్ లోన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. చాలా బ్యాంకులు ఇల్లు నిర్మించడానికి 2- నుంచి 3 సంవత్సరాల సమయం ఇస్తాయి. ఈ వ్యవధి పూర్తయ్యేలోపు మీరు మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన రుజువులను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సమర్పించడంలో విఫలమైతే, ముందుగా నిర్ణయించిన ప్లాట్ లోన్ వడ్డీ రేట్లపై 2 నుండి -3 శాతం జరిమానా విధిస్తాయి.” అని పేర్కొన్నారు.
పన్ను మినహాయింపు: మీరు తీసుకున్న ప్లాట్‌లో ఎటువంటి నిర్మాణం చేపట్టకపోతే పన్ను ప్రయోజనాలు పొందలేరని గుర్తించుకోండి. మీరు ప్లాట్లు ఖాళీగా ఉంచినట్లయితే, ఆ ప్లాట్‌పై తీసుకున్న రుణంపై వడ్డీని సెక్షన్ 24 (బి) కింద ఆదాయ-పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ దానిలో ఇళ్లు నిర్మిస్తే రూ .2 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.