హోమ్ లోన్ తీసుకున్న వారికి ఒక బ్యాడ్ న్యూస్. దేశంలోని ప్రముఖ బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీరేట్లను మరోసారి పెంచాయి. రెపో రేటుతో పాటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(MCLR)తో లింక్ అయిన హోమ్ లోన్ వడ్డీరేట్లను బ్యాంకులు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో కస్టమర్లు చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపోరేటును వివిధ దశల్లో పెంచింది. దీంతో దీనితో అనుసంధానమై ఉండే రెపో లింక్డ్ లెండింగ్ రేటు(RLLR)ను బ్యాంకులు పెంచాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచితే, ఆర్బీఐ నుంచి తీసుకున్న నిధులపై కమర్షియల్ బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. దీంతో ఈ భారాన్ని బ్యాంకులు కస్టమర్లపై మోపుతుంటాయి.
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : వివిధ గడువులతో ఇచ్చిన లోన్లపై ఎంసీఎల్ఆర్ను పెంచినట్లు తెలిపింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఆటో, పర్సనల్, హోమ్ లోన్ రేట్లు ఆధరపడే బెంచ్మార్క్ వన్ ఇయర్ MCLR రేటును ఈ బ్యాంకు 7.80 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు పెంచి, 7.50 శాతానికి చేర్చింది.
* HDFC బ్యాంక్ : ఈ బ్యాంకు ఇటీవల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పెంచింది. దీంతో దీనితో లింక్ అయిన హోమ్ లోన్లపై వడ్డీరేట్లు పెరిగాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2022 నవంబర్ 7 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. గతంలో ఓవర్నైట్ MCLR 7.90 శాతం ఉండగా, ఇప్పుడు 8.20 శాతానికి పెరిగింది. ఒక నెల MCLR 7.90 శాతం నుంచి 8.25 శాతం పెరిగింది.