అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి విలువ, దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల కీలక వడ్డీ రేట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అలాగే కొన్ని బ్యాంకులు ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా డిమాండ్ కనిపించింది.
* హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ : సీనియర్ సిటిజన్స్ కోసం 2020లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తిస్తుంది. 5-10 ఏళ్ల కాల పరిమితితో ఎఫ్డీ చేయాలి. సీనియర్ సిటిజన్లకు 0.75% అధిక వడ్డీ రాగా ఏడాదికి 7.75% వడ్డీ లభిస్తుంది. ఆకర్షణీయమైన వడ్డీ కోసం చూసేవారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.
* ఐడీబీఐ బ్యాంక్ నామన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ : ఈ స్కీంలో సీనియర్ల సిటిజన్లకు 0.75% అదనపు వడ్డీ లభిస్తుంది. కనీస డిపాజిట్ రూ.10 వేలు అయినా ఉండాలి. ప్లాన్ గడువు పూర్తికాక ముందే విత్‌డ్రా అయ్యే అవకాశం ఉంది. IDBI బ్యాంక్ స్వీప్-ఇన్, పార్షియల్ విత్‌డ్రాతో సహా ఏదైనా ప్రీమెచూర్ విత్‌డ్రాలపై 1% ఛార్జీ విధిస్తారు.
* పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీం : పంజాబ్ సింధ్ బ్యాంక్ సీనియర్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్‌లో పీఎస్బీ ఫ్యాబ్యులస్ 300 డేస్, పీఎస్బీ ఫ్యాబ్యులస్ ప్లస్ 601 డేస్, పీఎస్బీ ఈ-అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్, పీఎస్బీ ఉత్కర్ష్ 222 డేస్ ప్లాన్లు ఉన్నాయి. సాధారణమైన వాటికంటే ఇందులో రాబడి బాగుంటుంది.
* ఇండ్ శక్తి 555 డేస్ ఎఫ్డీ : ఇండియన్ బ్యాంక్ ఇండ్ శక్తి 555 డేస్ పేరుతో స్పెషల్ రిటైల్ టర్మ్ ప్లాన్ ప్రకటించింది. దీన్ని గత డిసెంబర్ 19న ప్రకటించారు. రూ.5,000 నుంచి రూ.2 కోట్ల వరకు ఈ పథకంలో ఎఫ్డీ చేయొచ్చు. ఈ స్కీంలో సాధారణ పౌరులకు 7% వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లు అయితే 7.15% నుంచి 7.50% వడ్డీ లభిస్తుంది. 555 రోజులకు మంచి రాబడి ఉంటుంది.
* ఎస్బీఐ అమృత్ కైలాష్ డిపాజిట్ ఎఫ్డీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ దేశంలో ఉండేవారితో పాటు ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఓ స్పెషల్ ఎఫ్డీని ప్రకటించింది. 400 రోజుల కాల పరమితితో ఎస్బీఐ అమృత్ కైలాష్ డిపాజిట్ ఎఫ్డీ పథకంలో డిపాజిట్ చేస్తే.. సాధారణ పౌరులకు 7.10% వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ వస్తుంది. వీటన్నింటి గడువు మార్చి 31తో ముగియనుంది. ఎవరైనా ఎఫ్డీ చేద్దామనుకుంటే ఈ గడువులోగా చేయడం మంచిది.