చాలామందికి స్థిరాస్తిని కొనుగోలు చేయాలనేది ఒక కల. తమ కష్టార్జితాన్ని కూడబెట్టి సొంత ఇంటిని లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేస్తుంటారు. కొందరు మగవారు తమ పేరు మీద చేయించుకుంటే, మరికొందరు తమ భార్యను కూడా సహ యజమానిగా చేరుస్తుంటారు. ఇలా స్థిరాస్తి కొనుగోలులో మహిళలను భాగస్వాములు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
* వాటా ఎంతో తేల్చుకోండి : స్థిరాస్తి కొనుగోలు సమయంలో దంపతులు చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే. ప్రాపర్టీపై ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. ఉదాహరణకు ఇల్లు కొనేముందు ఇందులో భార్య వాటా, భర్త వాటా ఎంతో నిర్ధారించుకోవాలి. ఫలితంగా ఇద్దరి పేరుమీద ఓనర్షిప్ ఉంటుంది. ఉమ్మడిగా కొనుగోలు చేసే సమయంలో వాటాని పేర్కొనకపోతే దాన్ని చెరి సగంగా (50:50) పరిగణిస్తారు. ఇలా జాయింట్‌గా కొనుగోలు చేయడం వల్ల ట్యాక్స్ బెనెఫిట్స్ కూడా ఉంటాయి.
* పన్ను మినహాయింపు : 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం స్థిరాస్తి కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80C ప్రకారం జాయింట్ ఓనర్లకు విరివిగా రూ.1.50లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఉంది. దీనితో పాటు సెక్షన్ 24 ప్రకారం హౌసింగ్ ప్రాపర్టీ ఇన్‌కం నుంచి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్‌పై రూ.2లక్షల వరకు డిడక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
* లోన్ ఎలిజిబిలిటీ : ఒకరి ఆదాయంపై కన్నా ఇద్దరి ఆదాయంపై లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ఒక్కరితో పోలిస్తే ఇద్దరికి ఈ ఎలిజిబిలిటీ అధికంగా ఉంటుంది. అందువల్ల భార్యలు కూడా వేతన జీవులే అయితే, రుణ పరిమితి పెరుగుతుంది. ఇద్దరూ వేతన జీవులే కాబట్టి, దంపతుల వేతనాన్ని ఉమ్మడిగా పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు రుణ పరిమితిని పెంచుతాయి. ఫలితంగా అధిక మొత్తంలో రుణం పొందేందుకు వీలు కలుగుతుంది.
* స్టాంప్ డ్యూటీ మినహాయింపు : ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిందే. అయితే, మహిళలకు ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అందువల్ల మహిళలు సొంతంగా స్థిరాస్తులు కొనుగోలు చేసినా, సహ యజమానిగా ఉన్నా స్టాంప్ డ్యూటీ తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రాలు సామాజిక బాధ్యతగా ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి, భార్యను సహ యజమాని(కో ఓనర్)గా చేర్చుకోవడం వల్ల స్టాంప్ డ్యూటీ చెల్లించే సమయంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.