ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో గ్లోబల్ టెక్ కంపెనీలు (Tech Companies) ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. గత సంవత్సరం ప్రారంభమైన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతున్నాయి. గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బడా కంపెనీలు ఇప్పటికే గతేడాది ఉద్యోగులను తొలగించగా, కొత్త ఏడాదిలోనూ మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపాయి.
* ఆల్ఫాబెట్ (గూగుల్) : సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తాజాగా మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తాజాగా 12,000 ఉద్యోగులను తొలగించనుంది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం. ప్రధానంగా ఇంజినీరింగ్, ప్రొడక్ట్, రిక్రూటింగ్, కార్పొరేట్ టీమ్ వంటి విభాగాల్లో లేఆఫ్స్ ఉంటాయి. గ్లోబల్ ఆనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ లేఆఫ్స్‌కు పూనుకుంది.
* SAP : ఈ ఏడాది కూడా లేఆఫ్స్ ప్రకటించిన కంపెనీల జాబితాలో ఐరోపా సాఫ్ట్వేర్ దిగ్గజం SAP తాజాగా చేరింది. ఈ సంస్థ తాజాగా 2,900 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. SAP తన మొత్తం వర్క్ ఫోర్స్ (1,12,000)లో 2.5 శాతం ఉద్యోగాల కోత ఉంటుందని పేర్కొంది. గతేడాది 150,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని, ఇది 30 శాతంగా ఉందని కంప్యూటర్ వరల్డ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
* Spotify : మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం Spotify కూడా లేఆఫ్స్ ప్రకటించింది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గత సోమవారం ప్రకటించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం అని కంపెనీ ప్రకటించింది. ఆదాయ వృద్ధికి ముందస్తు పెట్టుబడి చాలా అవసరం కాబట్టి, ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు ఈ స్వీడిష్ కంపెనీ CEO డేనియల్ ఎక్ ఉద్యోగులకు పంపిన మెమోలో తెలిపారు. కంపెనీ లాస్ట్ ఎర్నింగ్ రిపోర్ట్ ప్రకారం.. సంస్థలో కేవలం 9,800 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు.
* రాబోయే రోజుల్లో భారీగా లేఆఫ్స్ : రాబోయే మరికొన్ని నెలల్లో చాలా కంపెనీలు తమ పేరోల్స్ తగ్గించుకుంటాయని అనేక రిపోర్ట్స్ వెల్లడించడంతో ఈ ఏడాది కూడా లేఆఫ్స్ భారీగా ఉంటాయని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిక్స్ (NABE) సర్వే రిపోర్ట్‌ను CNN ఉటంకిస్తూ రాబోయే మూడు నెలల్లో సంస్థల్లో ఉద్యోగాల కోత పెరుగుతుందని అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభ రోజుల్లో కంటే ఇప్పుడు సంస్థల్లో ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని అంచనా వేయడం ఇదే మొదటిసారి.