దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై పన్నులు తగ్గించుకున్న ప్రభుత్వాలు.. ఆ లోటును చిన్నాచితకా వస్తు, సేవలపై జీఎస్టీ బాదుడు ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాలు కలిసుండే జీఎస్టీ (వస్తు సేవల పన్ను) మండలి కీలక ప్రతిపాదనలు చేసింది. ఆమోదం తర్వాత ఏక్షణమైనా రేట్ల పెంపు అమలుకావొచ్చు.
ఇక ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5 వేల కన్నా ఎక్కువ అద్దె కలిగిన గది తీసుకుంటే 5 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. అయితే, ఐసీయూకు మినహాయింపు ఉంటుంది. మరోవైపు పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, బుక్‌పోస్ట్, ఎన్వలప్ (పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి)లు మినహా అన్ని పోస్టల్ సేవలపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు.
బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లను రాష్ట్రాల మధ్య రవాణా చేసుకునేందుకు ఈ-వే బిల్లును తప్పనిసరి చేసే అంశంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని మండలి పేర్కొంది. రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరి చేయాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. పన్ను ఎగవేతలను అడ్డుకొనేందుకు ఈ విధానాన్ని ప్రతిపాదించారు.
మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార పదార్థాలకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉండగా.. ఇకపై ఆయా పదార్థాల మీద 5శాతం జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. విద్యార్థులు ఇతరులు వాడే మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లపైనా 12శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)