1. కరోనా మహ్మమ్మారి 4.9 లక్షల మంది భారతీయులను బలితీసుకుందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా మరణాలు ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. కోవిడ్ కేవలం ఆరోగ్య సంరక్షణ పద్దతులనే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలను తట్టుకోవడం కూడా నేర్పింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనారోగ్యంతో మరణించినప్పుడు సహాయం చేయడానికి జీవిత బీమా (Life Insurance) ఒక ఆర్థిక సాధనం. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే దేశంలో చాలా మందికి జీవిత బీమా ఉండకపోవచ్చు. కానీ జనాభాలో చాలా మందికి బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డ్ (Debit Card), క్రెడిట్ కార్డ్ (Credit Card) ఉన్నాయి. 2021 సెప్టెంబరునాటికి దేశంలో 92 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయని రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డుదారులు ప్రమాదంలో మరణించడం లేదా ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరితే ఆ కార్డులు బీమా కవరేజీ అందిస్తాయని చాలా మందికి తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. డెబిట్, క్రెడిట్ కార్డులను బట్టి రూ.50,000 నుంచి రూ.10,00,000 వరకు బీమా రక్షణ లభిస్తుంది. ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరడం, ప్రమాదంలో మరణించినప్పుడు బీమా పొందాలంటే, ప్రమాదానికి ముందు డెబిట్, క్రెడిట్ కార్డులను 90 రోజుల్లో కనీసం ఒక్కసారి అయినా ఉపయోగించి ఉండాలి. అంటే డెబిట్, క్రెడిట్ కార్డులను గడచిన 90 రోజుల్లో ఏటీఎం (ATM), పాయింట్ ఆఫ్ సేల్ (PoS), ఈ- కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఉపయోగించి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కార్డుదారులకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో ప్రమాద బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగిన 90 రోజుల్లోపే పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీని క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల తరువాత ఇది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కార్డుదారుడు బ్యాంకు ఖాతాలో నమోదు చేసిన నామినీ ఈ బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కార్డుదారునికి ఇతర బీమా కవరేజీ ఉన్నా కూడా ఈ క్లెయిమ్ పొందడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రమాద మరణాన్ని, శాశ్వత వైకల్యాన్ని ధ్రువీకరించడానికి కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే వివిధ బ్యాంకులను బట్టి పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ మొత్తం మారుతుంది. మరిన్ని వివరాల కోసం బ్యాంకుల వెబ్సైట్లలో అధికారిక సమాచారం చూడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎస్బీఐ రూపే కార్డ్ (SBI RupayCard) బీమా పొందడానికి సక్రమంగా పూర్తి చేసిన క్లెయిమ్ పత్రాలపై సంతకం చేసి సమర్పించాలి. మరణ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్ కాపీ సమర్పించాలి. ప్రమాదాన్ని తెలిపే ఎఫ్.ఐ.ఆర్ ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కాపీ, కెమికల్ ఎనాలసిస్, ఎఫ్.ఎస్.ఎల్ (FSL) నివేదికలతో కూడిన పోస్ట్ మార్టం నివేదిక ఒరిజినల్ లేదా ధ్రువీకరించిన కాపీ అందించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. వీటితో పాటు నామినీ, కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు కాపీలు అవసరం. బ్యాంకు అధికారుల నుంచి కార్డు వివరాలను ధ్రువీకరిస్తూ సంతకం చేసి, స్టాంప్ వేసిన డిక్లరేషన్, 90 రోజుల బ్యాంకు స్టేట్మెంట్.. నామినీ పేరు, బ్యాంకింగ్ వివరాలు( పాస్‌బుక్ కాపీ సహా).. ఇంగ్లీష్ లేదా హిందీలో అనువదించిన ఎఫ్.ఐ.ఆర్ (FIR) కాపీ.. వంటి వివరాలు సైతం సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)