ఆర్థిక మాంద్యం భయాల నడుమ టాప్ కంపెనీలు లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. అనేక కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నాయి. తాజాగా ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్ మన్ శాక్స్.. ఒక్కరోజులో 3000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించి, వారికి షాక్ ఇచ్చింది.
* ఉదయం 7:30కి మీటింగ్ : న్యూయార్క్ పోస్ట్ వివరాల ప్రకారం.. ఉదయం 7:30 గంటలకు మీటింగ్‌కి రావాలంటూ గోల్డ్‌మన్ శాక్స్(Goldman Sachs) సంస్థ ఉద్యోగులకు ఇన్విటేషన్లు పంపించింది. అక్కడున్న హెడ్ వారికి స్వాగతం పలికారు. తర్వాత ప్రొసీడింగ్స్ జరుగుతున్న సమయంలో వారిని సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. దీంతో వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు.
ఈ విషయంపై గోల్డ్‌మన్ శాక్స్ ఉద్యోగి ఒకరు స్పందించారు. తన కొలీగ్‌ను జాబ్ నుంచి తొలగించడంపై మాట్లాడారు. ‘వేరే కారణాలు చెప్పి మీటింగ్‌కి పిలిపించారు. తాము ఈ పని చేస్తున్నందుకు సారీ చెబుతున్నామని చెప్పి, అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. బెస్టాఫ్ లక్ చెప్పి పంపించారు.’ అంటూ చెప్పుకొచ్చారు.
న్యూయార్క్ పోస్ట్‌తో మరో ఉద్యోగి మాట్లాడుతూ.. ‘ఉదయం ఏడున్నర గంటలకు ఆసియా ఫసిపిక్ కౌంటర్ పార్ట్లతో కాల్స్ ఉన్నాయంటూ ఉద్యోగులను మీటింగ్‌కి పిలిచారు. అవి అమెరికాలో అయితే ఆఫ్ అవర్స్. కానీ ఆసియాలో ఉన్న వారితో కాల్స్ అనడంతో ఎవరూ టైమింగ్ గురించి ప్రశ్నించలేదు. అలా తప్పుడు కారణాలతో వారిని మీటింగ్‌కి పిలిచి లేఆఫ్స్ ఇస్తున్నట్లు చెప్పారు. అలా చెబుతున్న వారు వెంటనే ఆఫీసు వదిలి వెళ్లిపోవచ్చని లేదా కొలీగ్స్ వచ్చి వీడ్కోలు ఇచ్చాక బయలుదేరవచ్చంటూ ఆప్షన్లు కూడా ఇచ్చారు. దీంతో ఆఫీసు సమయంలో వచ్చిన ఉద్యోగులు అంతకుముందు ఉదయాన్నే ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు’ అని తెలిపారు.
గోల్డ్ మన్ శాక్స్ తరహాలోనే ఇతర గ్లోబల్ బ్యాంకులు అయిన మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్ ఇంక్‌లు ఈ మధ్య కాలంలోనే తమ ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటాలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ మధ్య కాలంలో తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.